Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్మీ నూతన చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత జనరల్ ఎంఎం నరవణే నుంచి ఆయన 29వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి ఆర్మీ చీఫ్‌గా నాయకత్వం వహించిన మొదటి అధికారి జనరల్ పాండే కావడం విశేషం. ఆయన ప్రభుత్వ ప్రణాళికలకు అనుగుణంగా ఇండియన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1న ఆర్మీ వైస్ చీఫ్‌గా పాండే బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్లలో సరిహద్దు వాస్తవాధీనరేఖ (ఎల్‌ఎసి)ని కాపాడే తూర్పు ఆర్మీ కమాండ్‌కు నాయకత్వం వహించారు. జనరల్ పాండే త్రివిధ దళాల సర్వీసెస్ అండమాన్ అండ్ నికోబార్ (సిఐఎన్సిఎఎన్) కమాండ్ చీఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అతను 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ (ది బాంబే సప్పర్స్)లో నియమితులయ్యారు. ఆయన అన్ని రకాల కేటగిరీల్లోనూ.. కమాండ్, సిబ్బంది నియమాకాల్లోనూ బాధ్యత వహించారు. జమ్ము కాశ్మీర్‌లోని ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో నియంత్రణ రేఖ వెంబడి ఇంజనీర్ రెజిమెంట్, పశ్చిమ సెక్టార్లో ఇంజనీర్ బ్రిగేడ్, ఎల్ఓసి వెంబడి పదాతి దళం, పశ్చిమ లడక్‌లోని ఎత్తయిన ప్రాంతంలో పర్వత విభాగానికి, ఈశాన్య ప్రాంతంలో ఒక కార్ప్స్కు నాయకత్వం వహించారు.
రాష్ట్రపతిని కలిసిన నరవణే దంపతులు
ఆర్మీ చీఫ్‌గా రిటైర్ అవుతున్న ఎంఎం నరవణే, తన సతీమణి వీణాతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, సవితా కోవింద్ దంపతులను రాష్ట్రపతి భవన్లో శనివారం కలిశారు.