Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విడుదల తర్వాత జిగేష్ మేవానీ వ్యాఖ్య
- ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు కొనసాగిస్తాం
గువహటి : తన అరెస్టు వెనుక బీజేపీ కుట్ర వుందని గుజరాత్ ఇండిపెండెంట్ ఎంఎల్ఎ జిగేష్ మేవానీ తెలిపారు. వారం రోజులకు పైగా అస్సాం పోలీసుల కస్టడీలో వుండి బెయిల్‌పై విడుదలైన ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అడ్డగింపులు, బెదిరింపులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగపరచడం వంటి చర్యలేవీ కూడా ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై తాను జరిపే పోరాటాన్ని అడ్డుకోలేవని అన్నారు. ''మోడీజీ గుజరాత్‌కు వస్తున్నందున, అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో శాంతి సామరస్యం నెలకొనేలా చూడాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ట్వీట్ చేశాను. ఇందులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేంత తప్పు వుందా?'' అని మేవానీ ప్రశ్నించారు. అయినా తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని, అరెస్టు చేశారని, దీన్ని బట్టే దీని వెనుక కుట్ర వుందని అర్ధమవుతోందని చెప్పారు. 'నన్ను ఎలాగైనా వేధించాలని బీజేపీ అనుకుంది. కానీ నేను వేధింపులకు గురైనట్లు భావించడం లేదు. దీనికన్నా రాజ్యాంగం పట్ల విశ్వాసమున్నందుకు బీజేపీ నన్ను లక్ష్యంగా చేసుకుందని ఈ దేశానికి తెలిసింది.'' అని అన్నారు. దమ్ముంటే నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజరు మాల్యా తదితరులను అరెస్టు చేయండని ఆయన సవాలు విసిరారు. మోడీ, ఆర్ఎస్ఎస్, బిజెపిలపై తన పోరాటం కొనసాగుతుం దన్నారు. వాస్తవాల కోసం, గుజరాత్ ప్రజల కోసం తాను పోరు కొనసాగిస్తానని చెప్పారు. ఆదివారం గుజరాత్ వ్యాప్తంగా జైల్‌భరో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతా యన్నారు. ప్రధానిపై నిందాపూర్వక ట్వీట్ చేశారంటూ ఏప్రిల్ 20న మేవానీని గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో అరెస్టు చేశారు. 29న అస్సాంలోని బార్పేట్ జిల్లా సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం రాత్రి ఆయన విడుదలయ్యారు. మేవానీపై నమోదైన ఎఫ్ఐఆర్ తప్పుగా నమోదైందని కోర్టు కూడా వ్యాఖ్యానించింది. మోడీపై వివాదాస్పద ట్వీట్ చేశారంటూ ఏప్రిల్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 21న మహిళా పోలీసు అధికారిపై ఎంఎల్ఎ దాడి చేశారని, అసభ్యంగా వ్యవహరించారని పేర్కొంటూ మరో ఎఫ్ఐఆర్ దాఖలైంది. రెండు రోజుల వ్యవధిలోనే ఆయనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.