Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటుకు వెళ్లలేకపోతున్న ఆదివాసీలు, దళితులు
- పడిపోతున్న జీవన ప్రమాణాలు, చుట్టుముడుతున్న రోగాలు
- ఆయుష్మాన్ భారత్ కవరేజీ అంతంత మాత్రమే : ఆక్స్‌ఫాం ఇండియా నివేదిక
- హాస్పిటల్ బిల్లులో బీమా కవరేజీ.. 30శాతం లోపే
న్యూఢిల్లీ : భారత్‌లో ప్రభుత్వ వైద్యం దెబ్బతింటున్న తీరు అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకుందని, దళితులు, ఆదివాసీలు మెరుగైన వైద్యం పొందలేకపోతున్నారని 'ఆక్స్‌ఫాం ఇండియా' నివేదిక హెచ్చరించింది. వైద్య సేవలు అందరికీ సమానంగా అందే పరిస్థితి లేదని, దేశంలో వైద్య సేవల్ని ప్రయివేటు రంగం 62శాతం ఆక్రమించిందని నివేదిక తెలిపింది. 4శాతం మంది ఆదివాసీలు, 15శాతం దళితులు ప్రయివేటు హాస్పిటల్స్‌లో వైద్య సేవలు పొందుతున్నారని, ప్రభుత్వ వైద్య సేవలతో పోల్చితే, ప్రయివేటులో వైద్య సేవల కోసం 524శాతం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని నివేదికలో పరిశోధకులు తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన 'పీఎం జన్ ఆరోగ్య యోజన' పనితీరు నిరాశజనకంగా ఉంది. పేదలు, అణగారిన వర్గాలకు ఇదెంతగానో ఉపయోగపడుతుందని పాలకులు ప్రచారం చేశారు. వివిధ రాష్ట్రాల్లో పథకం అమలు తర్వాత పెద్దగా ఉపయోగం లేదని తేలింది. ప్రయివేటు హాస్పిటల్ బిల్లులో ఆయుష్మాన్ భారత్ కవరేజీ 30శాతం కన్నా తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. దాంతో మిగతా బిల్లు రోగులు తమ జేబు నుండి చెల్లించాల్సి వస్తోందని, ఇందుకోసం అనేక కుటుంబాలు అప్పులపాలవుతున్నాయని అధ్యయనంలో తేలింది.
నియంత్రించే వ్యవస్థే లేదు
ప్రయివేటు హాస్పిటల్ బిల్లులు భరించలేని స్థాయిలో ఉన్నాయని, వీటిని
నియంత్రించే వ్యవస్థ లేకపోవటాన్ని తప్పుబట్టింది. దళితులు, ఆదివాసీలు వైద్య సేవలకు దూరమవుతున్నారని, ఉన్నత సామాజిక తరగతికి చెందిన ఒక హిందూ మహిళతో పోల్చితే, ఒక దళిత మహిళ సగటు జీవన ప్రమాణం 15ఏండ్లు తక్కువగా ఉందని తేలింది. 65శాతం మంది ఆదివాసీ మహిళల్లో రక్తహీనత ఉందన్న సంగతి బయటపడింది. ఇతర సామాజిక వర్గాల్లో టెటనస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 81శాతం ఉండగా, ఎస్టీ మహిళల్లో 61శాతం మంది పొందారు.
వైద్యరంగంలో నెలకొన్న పరిస్థితులు, జవాబుదారీతనం లేకపోవటం అణగారిన వర్గాలకు, పేదలకు శాపంగా మారిందని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రయివేటు హాస్పిటల్స్ లాభాలే లక్ష్యంగా నడుస్తున్నాయని, ఇందులోని వైద్య సేవలు పొందటం కోసం అనేక కుటుంబాలు అప్పులు చేయాల్సి వస్తోందని, కొన్ని హాస్పిటల్స్‌లో అవసరం లేని వైద్య పరీక్షలు జరుపుతున్నారని, బిల్లులు భారీగా వసూలు చేస్తున్నారని నివేదిక పేర్కొన్నది.