Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఏచూరి
- సీఐటీయూ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన హేమలత
న్యూఢిల్లీ : దేశంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) ఘనంగా జరిగింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎర్ర జెండాలు రెపరెపలాడింది. ఆయా రాష్ట్రాల్లో ఎర్ర జెండాలను నేతలు ఆవిష్కరించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు జరిగాయి. జీపు జాతాలు, ప్రదర్శనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, మోటర్ సైకిల్ ర్యాలీ, సైకిల్ యాత్రలు, భారీ ప్రదర్శనలతో పాటు వినూత్న కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నా టక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, అసోం, మహారాష్ట్ర, ఒరిస్సా, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, పుదుచ్చేరితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మేడే కార్యక్రమాలు జరిగాయి. కర్నాటక రాష్ట్ర ఐటీ, ఐటిఈఎస్ ఉద్యోగుల సంఘం కార్యకర్తలు రెడ్ షర్ట్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. బెంగుళూరు సిటీలో భారీ ప్రదర్శన జరిగింది. జమ్మూ కాశ్మీర్లో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఢిల్లీలో సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జెండా ఆవిష్కరించారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బివి రాఘవులు, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ కేంద్ర కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షురాలు కె.హేమలత జెండా ఆవిష్కరించారు. సీఐటీయూ నేతలు జెఎస్ మజుందార్, స్వదేశ్ దేవ్ రారు, కెఎన్ ఉమేష్, ఆర్. కరుమలయన్, ఎఆర్ సింధూ, ఎంఎల్ మాల్కోటియా, ఏఐకేఎస్ నేత పి. కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ ఎల్పీజీ సిలిండర్ ధర పెంపు 'కార్మికులు, పేదలపై దాడి' వ్యాఖ్యానించారు. పెట్రోలియం ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
''కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులపై కొత్త దాడులు జరుగుతున్నాయి. కార్మికులపైనే కాకుండా మొత్తం దేశంలోని శ్రామిక ప్రజలపై కూడా దాడులు పెరిగాయి. గత కొంతకాలంగా కేంద్ర పన్నులు పెరిగాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడానికి కేంద్రం విధించిన సుంకాలే ప్రధాన కారణమని అన్నారు. రాష్ట్రాల కంటే కేంద్రం ఆదాయం రెట్టింపు పెరిగిందని విమర్శించారు. ''పన్ను ద్వారా రాష్ట్రాలకు వచ్చే ఆదాయం పెరగ లేదు. కాకపోగా తగ్గింది. కేంద్రానికి రెండింతలు పెరిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా గత మూడు పార్లమెంట్ సమావేశాల్లో స్వయంగా చెప్పారు. పన్నుల ద్వారా రూ.8 లక్షల కోట్లు కేంద్రానికి వచ్చింది. కేంద్ర పన్నులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం'' అని అన్నారు.
సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాలను ఏచూరి ప్రశ్నించారు. ''ప్యాసింజర్ రైళ్లను బంద్ చేసి బొగ్గు సరఫరా చేయడానికి రైల్వేలను ఉపయోగిస్తున్నారు. ఇన్ని రోజులు మీరు ఏమి చేసారు?'' అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ''వేసవి రోజుల్లో బొగ్గు కొరత ఏర్పడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే, అందుకు సన్నాహాలు ఎందుకు చేయలేదు. ముందు ప్రభుత్వం ఎందుకు సిద్ధం కాలేదని ప్రశ్నించారు'' అని ప్రశ్నించారు.
''కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఉంది. పరిష్కారం లేదు. పేద ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావాలను చూపుతుందో దాని విధానాలలో విశ్లేషించడంలో కూడా విఫలమైంది'' అని ఏచూరి విమర్శించారు. దేశంలో ''మత ధ్రువీకరణను తీవ్రతరం చేసే'' ఉద్దేశంతో ''శాంతిని పాడుచేసే'' కుట్రలో భాగంగానే లౌడ్‌స్పీకర్ గొడవను ముందుకు తెచ్చారని విమర్శించారు. ''స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఇంతకు ముందు కూడా శాంతియుతంగా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు శాంతిభద్రతలను పాడుచేసే కుట్ర జరుగుతోంది. ద్వేషం, హింసాకాండ ప్రాతిపదికన మత ధ్రువీకరణను తీవ్రతరం చేసి దృష్టిని మరల్చడం ఒక్కటే లక్ష్యం. ఆకలి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రజాస్వామ్య హక్కులు వంటి ప్రాథమిక సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు'' అని ఆయన విమర్శించారు.