Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లండన్‌లో కిల్ ద బిల్ భారీ ర్యాలీ
- ఫ్రాన్స్‌లో 'లాంగ్ లివ్ మే 1' బ్యానర్లతో ప్రదర్శనలు
- ఇస్తాంబుల్‌లో నిరసనకారులపై టియర్‌గ్యాస్ ప్రయోగం
- బోస్నియా, సియోల్, వియన్నా, పారిస్‌లలో కార్మికుల ర్యాలీలు
- ప్రపంచవ్యాప్తంగా ఘనంగా కార్మిక దినోత్సవం
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రభుత్వ విధానాలకు, చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు పిడిగిలి బిగించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని ఆయా దేశాల్లోని పలు నగరాల్లో రోడ్లమీదకొచ్చారు. కోవిడ్ సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉపాధిరంగం దెబ్బతినటంతో, ఆదివారంనాటి ర్యాలీలో కార్మికులు, సామాన్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనటం కనిపించింది. ఉద్యోగ భద్రత పోయిందని, తక్కువ వేతనాలు ఇస్తున్నారని, శ్రమ దోపిడీ పెరిగిందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంతో కార్మికుల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయని పలువురు పేర్కొన్నారు. కార్మిక హక్కులు పరిరక్షించాలని పారిస్, మాస్కో, సియోల్, వియన్నా, తైవాన్...నగరాల్లో భారీ ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ ప్రబలుతుందన్న కారణంతో టర్కీ, ఫిలిప్పైన్స్లలో నిరసన ర్యాలీలపై పోలీసులు ఆంక్షలు విధించారు. బ్రిటన్‌లో పోలీస్ అధికారాలను పెంచుతూ బోరిస్ జాన్సన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసనకారులు 'కిల్ ద బిల్' ర్యాలీ చేపట్టారు.
పారిస్‌లో నిరసనకారుల్ని అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం పోలీసుల్ని పెద్ద సంఖ్యలో మోహరించింది. పలు నగరాల్లో ఆదివారం మే డే ర్యాలీలో పాల్గొనడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లో రావటం గమనార్హం. సామాజిక, ఆర్థిక న్యాయం, నిరుద్యోగ పథకంలో మార్పులకు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు పలు చోట్ల నిరసనకారులపై టియర్‌గ్యాస్ ప్రయోగించారు. అనేకమందిని లాఠీలతో కొట్టి అరెస్టు చేశారు. పారిస్, లియాన్, నాంటెస్, లిల్లీ, టౌలోస్లలో దాదాపు 300కుపైగా ర్యాలీలు జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి. ఏథెన్స్, గ్రీస్, బోస్నియా, శ్రీలంకలో మెరుగైన వేతనాలను డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసన ర్యాలీలు చేపట్టారు.