Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ లోపం
- వినాశకర విద్యుత్ సంస్కరణల పర్యవసానం
న్యూఢిల్లీ : బొగ్గు- విద్యుత్-రైల్వే మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల మండు వేసవిలో దేశంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అంచనాలు ఉన్నా ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదు. గత ఏడాది అక్టోబర్‌లో దేశం ఇదే విధమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంది. కోల్ ఇండియా, సింగరేణి కోల్ తవ్విన బొగ్గును థర్మల్ పవర్ ప్లాంట్లకు అందించకపోవడమే సంక్షోభానికి ప్రధాన కారణం. బొగ్గు రవాణా సాఫీగా సాగేందుకు అవసరమైన ర్యాకులను సిద్ధం చేయడంలో రైల్వే శాఖ విఫలమైంది. ఏప్రిల్ 26 నాటికి థర్మల్ పవర్ ప్లాంట్లలో 21.45 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే నిల్వ ఉంది. ఇది సాధ్యమయ్యే సేకరణలో 30 శాతం మాత్రమే. 175 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో 105 నిల్వలు ఉండగా, 25 శాతం దాకా ప్లాంట్లు ఉత్పత్తిని ఎప్పుడైనా ఆపివేయవచ్చు. వేసవి వచ్చిందంటే విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే 203 గిగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరిగింది. 220 గిగావాట్లకు ఈ డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. దేశం ఇప్పటికే 8.2 గిగావాట్ల విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా మరింతగా బొగ్గును దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాలను కోరింది. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు టన్నుకు 50 డాలర్ల నుంచి 288 డాలర్లకు పెరిగాయి. ఈ పరిస్థితి గురించి ముందే అంచనా వున్నా మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం ఒక శాపంగా మారింది. దీనికితోడు ప్రభుత్వానికి దూరదృష్టి కొరవడడం, విద్యుత్ ప్రాజెక్టులను ప్రయివేట్ పరం గావించే విద్యుత్ సంస్కరణలు, ప్రణాళికాబద్ధమైన కృషి లోపించడం ఇవన్నీ విద్యత్ సంక్షోభానికి దారి తీశాయి. ఫలితంగా ఇప్పుడు పలు రాష్ట్రాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి.
గత సోమవారం (ఏప్రిల్25) నాడు 5.24 గిగావాట్లుగా ఉన్న విద్యుత్ కొరత గురువారానికి 10.77 గిగావాట్లకు చేరుకుంది. నేషనల్ గ్రిడ్ ఆపరేటర్ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పిఒఎస్ఒసిఒ) తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్ 24 ఆదివారం దేశంలో విద్యుత్ కొరత కేవలం 2.64 గిగావాట్లగా ఉంది. ఇది సోమవారానికి 5.24 గిగావాట్లకు, మంగళవారాని కి 8.22 గిగావాట్లకు, బుధవారానికి 10.29 గిగావాట్లకు, గురువారానికి 10.77 గిగావాట్లకు చేరుకుంది. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మే, జూన్ నెలల్లో పరిస్థితి ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది మే-జూన్‌ల్లో విద్యుత్ డిమాండ్ 215 నుంచి 220 గిగావాట్లకు చేరుకుంటుందని కేంద్ర విద్యుత్ శాఖ ఇప్పటికే వెల్లడించింది. 164 గిగావాట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 147 నాన్-పిట్‌హెడ్ థర్మల్ ప్లాంట్లలో ఏప్రిల్ 28, 2022 నాటికి బొగ్గు నిల్వలు 24 శాతం మాత్రమే ఉన్నాయని కేంద్ర విద్యుత్ అధారిటీ (సిఇఎ) తాజా పర్యవేక్షణలో వెల్లడయింది. ఈ కేంద్రాల్లో 57,236 వేల టన్నుల ఉండాల్సిన బొగ్గు నిల్వలు 13,755 టన్నులు మాత్రమే ఉన్నాయి. దేశంలో ఇప్పటికీ విద్యుత్ ఉత్పత్తి బొగ్గు ఆధారిత విద్యుత్ మీదే ఆధారపడి ఉంది.మోడీ సర్కారు నిర్వాకం వల్ల విద్యుత్ కోతలు, ప్యాసింజర్ రైళ్ల రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంక్షోభాన్ని ఆసరా చేసుకుని ఎలక్ట్రిసిటీ స్పాట్ మార్కెట్లో ధరలను భారీగా పెంచేశారు.