Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఎవరినీ బలవంతం పెట్టొద్దంటూ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చని పేర్కొంది. పలు సేవలు పొందేందుకు టీకాను తప్పనిసరి చేయడం రాజ్యాంగ విరుద్ధమేనని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా రవాణాను వినియోగించుకోవడానికి, సబ్సిడీలో ఆహార ధాన్యాలు పొందడానికి పలు రాష్ట్రాలు టీకాను తప్పనిసరి చేయడాన్ని ఈ పిటిషన్ లో ప్రస్తావించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గావైతో కూడిన ధర్మాసనం సోమవారం కీలక తీర్పు ఇచ్చింది.
''శరీర సమగ్రతకు చట్టం ప్రకారం రక్షణ ఉంది. ఎవరినీ టీకాలు తీసుకోవాలని బలవంతం చేయలేం. అలాగే ప్రస్తుత టీకా విధానం అసమంజసంగా ఉందనీ చెప్పలేం. శాస్త్రీయతపై ఇది ఆధారపడి ఉంది. అంతేగాకుండా వైరస్ ఇన్ఫెక్షన్లు తక్కువగా ఉన్నంత వరకూ.. ప్రజలు బహిరంగ ప్రదేశాలు, ఇతర సేవలు పొందే విషయంలో ఆంక్షలు విధించకూడదు. అయితే ఈ సూచన కరోనా నియమావళిని పాటించాలనే ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా ఉండకూడదు'' అని స్పష్టంగా తెలియజేసింది. అలాగే వ్యాక్సినేషన్ కు సంబంధించి ప్రతికూల ప్రభావాలపై వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నారులకు టీకా అందించే విషయం గురించి స్పందిస్తూ ఇదే ఆదేశం ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా ఆ సమాచారాన్ని వెల్లడించాలని స్పష్టం చేసింది.