Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టు సంఘాల డిమాండ్
- మీడియాపై పెరుగుతున్న దాడులకు ఖండన
న్యూఢిల్లీ : గత ఏడాది కాలంగా మీడియాపై దాడులు పెరుగుతుండడం పట్ల నేషనల్ అలయన్స్ ఫర్ జర్నలిస్ట్స్ (ఎన్ఏజే), ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (డీయూజే) తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశాయి. ఏకపక్ష అరెస్టులు, వేధింపుల నుంచి మీడియా సిబ్బందిని రక్షించేందుకు తక్షణమే సమగ్ర చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, పత్రికా స్వాతంత్య్ర పరిరక్షణకు నిర్భయంగా పోరాడేందుకు వీలు వుంటుందని పేర్కొన్నాయి. ఎలాంటి అధికారాలు లేని ప్రెస్ కౌన్సిల్ స్థానంలో మొత్తంగా మీడియా కోసం విశాల దృక్పథంతో వ్యవహరించే మీడియా కౌన్సిల్ను ఏర్పాటుచేయాలని జర్నలిస్టు యూనియన్లు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. గత కొన్నేండ్లుగా జర్నలిస్టులు, ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న దుస్థితిని పరిగణనలోకి తీసుకుని అన్ని పక్షాలకు చెందిన నిపుణులతో మీడియా కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. అన్ని వైపుల నుంచి ఎదురవుతున్న దాడులను ఎదుర్కొని భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు సాహసోపేతంగా పోరాడుతున్న జర్నలిస్టుల వాణిని వినిపించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్లు దృఢంగా తీర్మానించాయి. ఫాసిజం, జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించడం, దాడులు జరపడం, ఇంటర్నెట్పై నిషేధాలు, గూఢచర్యం వంటి అనేక చర్యల ద్వారా కొనసాగుతున్న పాలనాపరమైన, పోలీసుల వేధింపులను, పలు సవాళ్ళను ఈనాడు జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు. ట్రోలింగ్ అనేది వృత్తిపరమైన ముప్పుగా తయారైంది. దాన్ని అణచివేసేందుకు ఎలాంటి చర్యలు లేవు, పైగా సోషల్ మీడియాలో దాడులు, బెదిరింపులు ఎక్కువయ్యాయి. మహిళా జర్నలిస్టులు తరచుగా దాడులకు లక్ష్యాలుగా మారుతున్నారు. ఇటువంటి చర్యలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్టుల సంఘాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. ఇన్ని సవాళ్లు, సమస్యలతో జర్నలిస్టులు బాధపడుతున్నా ఏడాది కాలంగా ప్రెస్ కౌన్సిల్ ఛైర్పర్సన్ పదవి ఖాళీగా వుండడం విచారకరమని పేర్కొన్నాయి. అన్ని వార్తా సంస్థలకలు చెందిన వారితో కౌన్సిల్ పరిధిని విస్తరించడానికి ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోవడం పట్ల కూడా ఆసక్తి చూపడం లేదని విమర్శించాయి.