Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ విద్య కాషాయీకరణకు దిగుతున్నది. ఈ మేరకు పాఠశాల సిలబస్‌ను సవరించనున్నది. ఇందులో హిందూ గ్రంథాలను చేర్చనున్నది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ తెలిపారు. '' ప్రజలు, విద్యావేత్తల నుంచి సూచనలు తీసుకొని సిలబస్‌లో వేదాలు, భగవద్గీత, రామాయణం, ఉత్తరాఖండ్ చరిత్రను చేర్చబోతున్నాం'' అని ఆయన చెప్పారు. అలాగే, రాబోయే సెషన్లో నూతన విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) అమలు చేయనున్నట్టు తెలిపారు. నూతన విద్యా విధానం కింద సిలబస్ మార్పు విషయంలో అధికారులతో సమావేశానికి ఆదేశించినట్టు రావత్ చెప్పారు. డూన్ యూనివర్సిటీలో పరీక్షా పర్వ్ 4.ఓ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పై వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా భగవద్గీతను అకడమిక్ సిలబస్‌లో చేరుస్తున్న విషయం విదితమే. ఇటు మరో రాష్ట్రం కర్నాటకలోని విద్యా శాఖ మంత్రి బీసీ నగేశ్.. భగవద్గీత అనేది ఇతర మత గ్రంథాల లాగా కాదనీ, అది ''జీవిత విలువల'' గురించి మాట్లాడుతుందని వ్యాఖ్యలు చేసిన విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఒక పక్క బీజేపీ పాలిత రాష్ట్రాలు విద్య కాషాయీకరణకు దిగుతుంటే.. ఇటు సీబీఎస్ఈ ఇటీవల ఒక ఉర్దూ కవికి చెందిన రెండు పద్యాలను పదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకం నుంచి ఇటీవలే తొలగించటం తీవ్ర వివాదాస్పదంగా మారింది. తమ అజెండా అమలు కోసం విద్యను కాషాయీకరిస్తున్న కేంద్రం, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల వ్యవహార శైలిపై ఇటు విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.