Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణాల్లో 9.22 శాతం, గ్రామీణంలో 7.83 శాతం పెరుగుదల
- తెలంగాణలో 9.9 శాతం,ఏపీలో 5.3 శాతం : సీఎంఐఈ
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ రేటు పెరిగింది. మార్చిలో 7.60శాతం ఉన్న నిరుద్యోగ రేటు ఏప్రిల్‌లో 7.83శాతానికి పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. అత్యధిక నిరుద్యోగ రేటు పట్టణాల్లో నమోదైంది. మార్చిలో 8.28 శాతంగా ఉన్న పట్టణ నిరుద్యోగ రేటు, అది కాస్తా ఏప్రిల్‌లో 9.22 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర తగ్గుముఖం పట్టింది. కరోనా మహామ్మారి కారణంగా నెలకొన్న ఆర్థిక మందగమనం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నట్టు సీఎంఐఈ పేర్కొంది. పెరిగిన నిరుద్యోగ రేటులో బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలో 34.2 శాతం అత్యధికంగా నమోదైంది. హర్యానా, రాజస్థాన్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. దేశీయంగా డిమాండ్ మందగించడం, పెరుగుతున్న ధరలతో ఆర్థిక రికవరీ నెమ్మదించడం వల్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో కరోనా కారణంగా మిలియన్ల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు.
తెలంగాణలో 9.9 శాతం,ఏపీలో 5.3 శాతం, నిరుద్యోగ రేటు
తెలంగాణలో 9.9 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్‌లో 5.3 శాతంగా నమోదైంది. తెలంగాణలో మార్చి నెలలో 6.8 శాతం నమోదు కాగా, ఏప్రిల్ నెల నాటికి అది భారీగా పెరిగింది. హర్యానాలో 34.5 శాతం, రాజస్థాన్‌లో 28.8 శాతం, బీహార్‌లో 21.1 శాతం, జమ్మూ కాశ్మీర్లో 15.6 శాతం, గోవాలో 15.5 శాతం, త్రిపుర 14.6 శాతం, జార్ఖండ్‌లో 14.2 శాతం నిరుద్యోగ రేటు నమోదు అయ్యింది.