Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టుకు కేంద్రం విన్నపం
న్యూఢిల్లీ : రాజద్రోహంపై స్పందించేందుకు మరికొంత సమయం కావాలని సుప్రీం కోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షాస్మృతి (ఐపీఎస్)లోని 124ఏ సెక్షన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై తన ప్రతిస్పందనను దాఖలు చేయడానికి సమయాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక దరఖాస్తును సోమవారం దాఖలు చేసింది. ప్రతిస్పందన ముసాయిదా సిద్ధంగా ఉన్నదనీ, అయితే అది కాంపిటెంట్ అథారిటీ నుంచి నిర్ధారణ కోసం వేచి ఉందని ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం గత వారం ఏప్రిల్ 27న ప్రభుత్వం తన స్పందనను ఏప్రిల్ 30లోగా దాఖలు చేయాలని ఆదేశించింది. కేసును తుది పరిష్కారానికి జాబితా చేయాలని బెంచ్ ఆదేశించింది. మే 5న మరోసారి వాయిదా వేయబోమని స్పష్టం చేసింది. సెక్షన్ 124ఎ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించింది. జులై 2021లో ఈ అంశంపై నోటీసు జారీ చేస్తూ, స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తరువాత ఈ చట్టం అవసరమా? అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ వంటి భారత స్వాతంత్య్ర సమరయోధుల గొంతును అణచివేసేందుకు బ్రిటిష్ వారు ఈ నిబంధనను ఉపయోగించారని కోర్టు పేర్కొంది.