Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్ఐసీ ఐపీఓ ఇష్యూలో విలువను తక్కువ చేసి చూపిన ఫలితం ..?
- కార్పొరేట్లు, విదేశీ శక్తుల కోసం రాయితీలు
- ఐపీఓను నిలిపివేయాలి : కేంద్రానికి పీసీపీఎస్పీఎస్ డిమాండ్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీఓలో ఆర్థిక మోసం దాగి ఉందని.. ఈ వాటాల విక్రయాన్ని నిలిపివేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని 'ది పీపుల్స్ కమిషన్ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండ్ పబ్లిక్ సర్విసెస్ (పీసీపీఎస్పీఎస్)' నిపుణుల బృందం కోరింది. ఎల్ఐసీ ఐపీఓ కారణంగా ఆ సంస్థకు రూ.50 వేల కోట్లకు పైగా నష్టం కలుగుతుందని హెచ్చరించింది. పీసీపీఎస్పీఎస్లో కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్, కేంద్ర ఆర్థిక వ్యవహారాల మాజీ సెక్రెటరీ ఈఏఎస్ శర్మ, ఒకప్పటి ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యులు ఎస్పీ శుక్లా వంటి పలువురు ప్రముఖ విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, మాజీ అధికారులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు. పెట్టుబడులు పెట్టడం, ప్రయివేటీకరించటం వంటి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరు వాటాదారులు, విధాన రూప కల్పన ప్రక్రియకు సంబంధించిన వ్యక్తులతో చర్చించాలని పీసీపీఎస్పీఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. గ్లోబల్ ఇన్వెస్టర్ల ఒత్తిడికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తలొగ్గి.. షేర్లను భారీ డిస్కౌంట్‌తో ఆఫర్ చేస్తుందని పీసీపీఎస్పీఎస్ ఆరోపించింది. ''ఇది కుంభకోణం కంటే తక్కువేమీ కాదు. భారతదేశ ప్రయివేటీకరణ చరిత్రలో ఇది బహుశా అతిపెద్దది. ఎల్ఐసీ విలువను తప్పుగా లెక్కగట్టారు. ప్రయివేటు బీమా కంపెనీలతో పోల్చితే ఎల్ఐసీ విలువ బహుళ రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎల్ఐసీ ఐపీఓ షేర్ విలువ కనీసం రూ.3,379గా ఉండాలి. దాదాపు 22 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ.74,803 కోట్లు రావొచ్చని అంచనా. కానీ.. ఆ విధంగా చేయకపోవడం ద్వారా రూ.53,795 కోట్ల నష్టం వాటిల్లుతుంది.'' అని తెలిపింది. ప్రస్తుతం 3 శాతానికి సమానమయ్యే దాదాపు రూ.21వేల కోట్ల షేర్లను కేంద్రం అమ్మకానికి పెట్టింది. షేర్ల ధరల శ్రేణీని రూ.902-949గా నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా ఈ విలువను తప్పుగా లెక్కించారనేది పీసీపీఎస్పీఎస్ ప్రధాన అరోపణ. బీమా సంస్థకు వేల కోట్ల నష్టమే కాకుండా, ఎల్ఐసీ నిర్మాణంలో భాగస్వామ్యమైన లక్షలాది మంది పాలసీ హౌల్డర్లు దోపిడీకి గురవుతారని ఆందోళన వ్యక్తం చేసింది. దేశం కోసం శ్రద్ధ వహించే వారిని కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేయాలని కమిషన్ అభ్యర్థించింది. తరతరాలుగా ఉన్న సంస్థను విచ్ఛిన్నం చేసే చర్యలో ఐపీఓ అనేది మొదటి అడుగు అని ఆందోళన వ్యక్తం చేసింది. ఎల్ఐసీ ఇష్యూకు వ్యతిరేకంగా నిలబడుతున్న ఆ సంస్థ ఉద్యోగ సంఘాలకు పీసీపీఎస్పీఎస్ మద్దతు పలికింది. ఇప్పటికే సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో.. ఎల్ఐసీ ఐపీఓపై తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.