Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా, వర్గ పోరాటాల ద్వారానే అది సాధ్యం
- బీజేపీ విధానాల వల్ల రాష్ట్రాలు అడుక్కు తినాల్సిన దుస్థితి
- కేంద్రం పన్నుల్ని తగ్గిస్తేనే పెట్రో ధరలు తగ్గుతాయి
- బ్యూరోక్రాట్ల ఆందోళన సరైందే
- కేసీఆర్ ఆ మాటను ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు..?
- కీలకాంశాలతో మేం ప్రత్యామ్నాయాన్ని రూపొందిస్తాం
నవతెలంగాణతో సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
దేశంలో నాలుగు కీలకాంశాల ఆధారంగా వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్డీఎఫ్)ను నిర్మించేందుకు కృషి చేస్తామని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. అయితే అది ప్రజా, వర్గ పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని ఆయన నొక్కి చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానాల వల్ల సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా రాష్ట్రాల హక్కులు హరించుకుపోయి.. అవి అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ బ్యూరోక్రాట్లు ప్రధాని మోడీకి లేఖ రాయటం సరైందేనని చెప్పారు. అయితే వారు ప్రస్తావించిన అంశాలకంటే భయంకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం, సమాఖ్య వ్యవస్థ అనే నాలుగు కీలకాంశాల ఆధారంగా ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందిస్తామని వివరించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం సంస్మరణ సభలో పాల్గొనేందుకు ఇటీవల రాష్ట్రానికి విచ్చేసిన ఏచూరి... నవతెలంగాణ ప్రతినిధి బి.వి.యన్.పద్మరాజుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల సీపీఐ (ఎం) అఖిల భారత మహాసభలో ఆమోదించిన రాజకీయ తీర్మానం, పెట్రో ఉత్పత్తుల ధరలపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు, టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు, ప్రత్యామ్నాయ విధానాలు తదితరాంశాలను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
ఇటీవల కేరళలో మీ పార్టీ అఖిల భారత మహాసభలను నిర్వహించారు. ఈ క్రమంలో గతంతో పోలిస్తే తాజా రాజకీయ తీర్మానంలో కొత్తగా తీసుకున్న విధానమేంటి...?
'కొత్తగా తీసుకున్న విధానంలో ముఖ్యమైన అంశం... దేశంలో రాజకీయ బలాబలాలు మారితే తప్పితే మతతత్వ పార్టీని (బీజేపీ) అధికారంలోంచి దించాలనే మా లక్ష్యం నెరవేరదు. వాళ్లు అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆరెస్సెస్ విధానాన్నే ముందుకు తీసుకెళతారు. అది ఒక ఫాసిస్టు విధానం. ఆ విధానాన్ని ఓడించాలంటే ప్రజల్లో వర్గ బలాబలాలను మార్చాలి. ఇందుకోసం సీపీఐ (ఎం) తన సొంత బలాన్ని పెంచుకోవాలి. ఇది అత్యంత కీలకాంశం. గత మహాసభ నుంచి ఇప్పటి వరకూ మా లక్ష్యం బీజేపీని గద్దె దించటమే. ఇందుకోసం నాలుగు అంశాలు కీలకం. ఒకటి మా బలాబలాలను పెంచుకోవటం, రెండోది వామపక్ష ఐక్యతను బలపరచటం, మూడోది వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నింటినీ కూడగట్టి ఒక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించటం, ఇక నాలుగోది ఎవరైతే ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలను తీసుకుని ప్రజల్లోకి వెళుతున్నారో, వాళ్లందర్నీ కలుపుకుని పోవటం. తద్వారా ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని రూపొందించటమనేది ఇప్పుడు అవసరం. అయితే ఈ ఫ్రంట్ అనేది కేవలం రాజకీయ పార్టీల ఆధారంగానే కాకుండా వాటితోపాటు ప్రజా పోరాటాలు, సామాజిక పోరాటాల ఆధారంగా ఏర్పడాలి. పాలక వర్గాల విధానాలకు భిన్నంగా, వాటికి వ్యతిరేకంగా ప్రజానుకూల కార్యక్రమాలు, విధానాలతో ఈ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలి. ఇదే సమయంలో లౌకిక శక్తులను విశాలంగా, విస్తృతంగా కూడగట్టాలి. ఇది అత్యంత అవసరం. ఈ అంశాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చేపట్టాలి. తద్వారా ఎల్డీఎఫ్ను ఏర్పాటు చేయాలి. అది ప్రస్తుత పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలి. అయితే ఇవన్నీ ప్రజా ఉద్యమాలు, వర్గపోరాటాలు ఉధృతంగా జరిగినప్పుడే సాధ్యం...'
ఇటీవల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోడీ... పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలంటూ రాష్ట్రాలను కోరారు. దీనిపై మీ స్పందన...
'మొదట ప్రధాని చేయాల్సిన పని కేంద్రం వేస్తున్న పన్నులను తగ్గించటం. ఇప్పుడు పెట్రో ఉత్పత్తులపై కేంద్ర సుంకాలు 68 శాతంగా ఉన్నాయి. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీల్లో రాష్ట్రాలకు వాటా ఉంటుంది. 40 శాతం మేర ఆ వాటా వస్తుంది. కానీ మూడో వంతు ఈ సెంట్రల్ డ్యూటీల్లో సెస్, సర్ఛార్జీలు వేసింది కేంద్రం. కానీ సెస్, సర్ఛార్జీలు అనేవి రాష్ట్రాలకు వాటాగా రావు. వాటిని కేంద్రమే తీసేసుకుంటుంది. ఆర్థిక మంత్రి గత పార్లమెంట్ సెషన్లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ... 2018 నుంచి 2021 మధ్యలో కరోనా సమయంలో పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్రానికి 8.02 లక్షల కోట్లు వచ్చాయని చెప్పారు. ఈ రకంగా ప్రజల్ని కేంద్రం లూటీ చేస్తోంది. ఈ సెస్, సర్ఛార్జీలను కేంద్రం రద్దు చేస్తే పెట్రోల్ ధరలు దాదాపు 30 శాతం తగ్గుతాయి. ఆ పని వాళ్లు (కేంద్రం) చెయ్యటం లేదు. ఇది దగాకాక మరేమిటి..? ఇక రెండో విషయం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి డివిజబుల్ పూల్ నుంచి రాష్ట్రాలను మినహాయించి... సెస్, సర్‌ఛార్జి వేయటం. జీఎస్టీ పరిహారాన్ని రాష్ట్రాలకు ఎనిమిది వాయిదాల్లో కేంద్రం చెల్లించాలి. కానీ రాష్ట్రాలకు నాలుగు వాయిదాలే చెల్లించారు. ఇక్కడ మరో విషయమేమంటే ఇక ఇప్పటి నుంచి జీఎస్టీ పరిహారమే ఉండదు. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి మొదటి ఐదేండ్లు మాత్రమే దాన్ని చెల్లిస్తారు కాబట్టి ఇప్పటి నుంచి ఆ రూపంలో దక్కేది కూడా దక్కదు. జీఎస్టీ రాదు కాబట్టి... రాష్ట్రాలకు పన్నులేసే అధికారం పోయింది. ఇప్పుడు వారి దగ్గర మిగిలింది రెండు, మూడు అంశాలే. వాటిలో ఒకటి పెట్రో ఉత్పత్తులు. ఈ అవకాశం కూడా లేకుండా చేయాలనేది కేంద్రం ఆలోచన. అదే జరిగితే రాష్ట్రాలు దివాళా తీస్తాయి. అసలు కేంద్రం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెంచిందో సమాధానం చెప్పాలి. ప్రజలకు నిజంగా ప్రయోజనం చేకూర్చాలంటే పెట్రో ఉత్పత్తులపై పన్నులను తగ్గించండి. మరోవైపు రాష్ట్రాలకు వ్యాట్ ద్వారా ప్రధానంగా ఆదాయమొస్తుంది. వ్యాట్ అనేది వస్తువు విలువ మీద ఆధారపడి ఉంటుంది. కేంద్రం వస్తువుల ధరలను, పన్నులను పెంచటం వల్ల రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుంది కాబట్టి, ఆయా రాష్ట్రాలే తగ్గించాలని మోడీ చెబుతున్నారు. అసలు కేంద్రం ధరలను పెంచటం వల్లే ఈ ధరలు పెరుగుతున్నాయి కదా..? ఈ ముఖ్యమైన కారణాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మొత్తంగా కేంద్రం చేసే లూటీని, రాష్ట్రాల మీదికి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు...'
దేశంలో లౌకికత్వానికి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పెద్ద ఎత్తున సామాజిక ముప్పు ఉందంటూ ఇటీవల బ్యూరోక్రాట్లు ప్రధానికి లేఖ రాశారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు...?
'వాళ్లు రాసింది కరెక్టే. మా పార్టీ అఖిల భారత మహాసభలో చేసిన రాజకీయ తీర్మానం కూడా అదే. బీజేపీకి గతం నుంచే రాజ్యాంగాన్ని బలహీనపరచాలనే ధోరణి ఉండేది. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయటానికి ఆ పార్టీ పూనుకున్నది. మన రాజ్యాంగానికి నాలుగు ముఖ్యమైన స్థంభాలున్నాయి. అవి లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం, సమాఖ్య వ్యవస్థ. ఈ నాలుగు స్థంభాలను ఒక పద్ధతిలో బీజేపీ, మోడీ సర్కారు బలహీనపరుస్తున్నాయి. అందువల్ల వారు రాసింది కరెక్టే. కానీ దేశంలో పరిస్థితి అంతకంటే భయకరంగా ఉంది. ఎందుకంటే మోడీ సర్కారు... ఆరెస్సెస్ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నది. మనదేశంలో లౌకిక ప్రజాస్వామ్యం ప్రాతిపదికగా, దాని ఆధారంగా ఏర్పడిన రాజ్యాంగం స్థానంలో ఫాసిస్టు హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటమే ఆ అజెండా సారాంశం. అదే వారి లక్ష్యం, ఉద్దేశం. దాన్ని సాధించాలంటే ప్రస్తుతమున్న రాజ్యాంగం పోవాలి. ఇది ఉన్నంత వరకూ వాళ్ల లక్ష్యం నెరవేరదు. అదీ అసలు కథ...'
తాజాగా నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో ఒక ప్రత్యామ్నాయ అజెండాతో ముందుకెళతామంటూ సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ బీజేపీని గద్దె దించే విషయమై ఆయన ఎక్కడా స్పష్టతనివ్వలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?
'అసలు కేసీఆర్ ప్రత్యామ్నాయ అజెండా ఏంటి..? ఆయన ఆ విషయాన్ని ముందు స్పష్టంగా చెప్పాలి. కేసీఆర్ ఎవరికి ప్రత్యామ్నాయం రూపొందిస్తానంటున్నారు..? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం (కేంద్రంలోని బీజేపీ సర్కారు) తీసుకుంటున్న అజెండాకు ప్రత్యామ్నాయం అంటే ఆ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు తప్పా..? కాదా..? ఒకవేళ అది తీసుకునేది తప్పుడు నిర్ణయాలు, చర్యలు అనుకుంటే ఆ విషయాన్ని కేసీఆర్ ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు...? ఇటీవల హైదరాబాద్‌లో మా మీటింగు (సీపీఐ-ఎం కేంద్ర కమిటీ సమావేశాలు) సందర్భంగా మేమే వెళ్లి ఆయన్ను కలిసినట్టు కేసీఆర్ చెప్పారు. కానీ వాస్తవమేమంటే మమల్ని పిలిచింది ఆయనే. భోజనం పెట్టింది ఆయనే. మనమందరమూ కలవాలంటూ చెప్పింది కూడా ఆయనే...'
రాబోయే ఎన్నికల నాటికి సీపీఐ (ఎం)గా మీరు ప్రజల ముందు ఎలాంటి ప్రత్యామ్నాయ విధానాలను ఉంచబోతున్నారు..?
'మొదటి విషయమేమంటే అనేక రంగాల్లో ప్రత్యామ్నాయం కావాలి. వాటిలో ఒకటి ప్రజల సౌకర్యాలు. మన దేశంలో ఉన్న అనేక సమస్యల్లో కీలకమైంది నిరుద్యోగం. దేశంలో మెజారిటీ జనాభా యువకులు. వారందరికీ ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగానైతే ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చామో.. అదే విధంగా పట్టణాల్లో కూడా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టాలి. మనదేశం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. ఇందుకోసం ప్రభుత్వ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరగాలి. అలా చేస్తే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజానీకం చేతిలో డబ్బులు ఉండి, వారు ఖర్చు పెడితే, ఆర్థికరంగంలో డిమాండ్ పెరుగుతుంది. దాని వల్ల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. దీంతోపాటు మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అందులో పేర్కొన్న హామీలు.. సమానత్వం, రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం అనేవి ఇప్పుడు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. ఇప్పుడు రామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలను పరిశీలిస్తే... సమానత్వం పూర్తిగా దెబ్బతిన్నదనే ఆందోళన తీవ్రతరమవుతున్నది. ముస్లింలు అనగానే వాళ్ల మీద దాడులు, దౌర్జన్యాలు, ఘర్షణలకు దిగుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల మన రాజ్యాంగ పునాది దెబ్బతింటున్నది. అందువల్ల వీటన్నింటినీ పునర్ నిర్మించాల్సిన అవసరముంది. ఇక సామాజిక న్యాయం విషయానికొస్తే... దళితులు, గిరిజనులు, మహిళల మీద దాడులు కొనసాగుతున్నాయి. ఇది ఆందోళనకరం. కాబట్టి పైన చెప్పిన నాలుగు అంశాలను మనం బలోపేతం చేసుకోవాలి. అందుక్కావాల్సిన విధానాలనే మేం అనుసరిస్తాం. ఇదే ముఖ్యమైన మా అజెండా...'