Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోధుమలు, మొక్కజొన్న, సన్‌ఫ్లవర్, పామాయిల్ కొరత
- దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి!
- ఆహార పదార్థాలు, రసాయనాలు, కాస్మోటిక్స్ ధరలు పైపైకి..
- ఆహార ద్రవ్యోల్బణంతో ఆకలి సమస్య ఉధృతమవుతుంది : నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : గత రబీ సీజన్ నుంచే ఎరువులు, డీఏపీ ధరలు ఆల్‌టైం రికార్డ్‌స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. అంతేగాక బహిరంగ మార్కెట్లో అందుబాటులో లేకపోవటం, బ్లాక్‌మార్కెట్‌కు తరలటంతో రైతులు విసిగివేసారి పోయారు. దీనికితోడు సరైన వాతావరణం లేక పంజాబ్, హర్యానాలో గోధుమ పంట దిగుబడి 20శాతం పడిపోయింది. దాంతో గోధుమ దిగుమతుల కోసం అర్జెంటీనా వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. పామాయిల్ దిగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించింది. దీని ప్రభావం రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్‌పైన ఉంటుందంటే నమ్ముతారా? హోటల్స్, రెస్టారెంట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, బయో డీజిల్...ఇలా అనేకవాటిపై ప్రభావం పడనుంది. ఆహార ద్రవ్యోల్బణం..మనదేశంలో ఆకలి కేకలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జొన్నలు, మొక్కజొన్న, సోయా..ఇవి మనదేశంలోని పౌల్ట్రీ పరిశ్రమ, పశువుల పెంపకానికి పెద్ద ఎత్తున వినియోగిస్తారు. గతకొన్ని వారాలుగా ఆహార ఉత్పత్తుల ధరలు పెరగటంతో పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తక్కువ నాణ్యత గల గోధుమల్ని తమకు ఇవ్వాలని పౌల్ట్రీ, పశువుల పెంపకందార్ల యజమానులు కేంద్రాన్ని కోరారు. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతోందనడానికి ఇదొక ప్రధాన సూచిక.
పలు దేశాల్లో కరవు
బ్రెజిల్, అర్జెంటీనా, అమెరికా..పలు దేశాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఆహార పంటల దిగుబడి పడిపోయింది. ఓ వైపు ఉక్రెయిన్ సంక్షోభం మనదేశంలో వంటనూనె ధరల పెరుగుదలకు ప్రత్యక్షంగా కారణమైంది. ఇప్పుడు ప్రపంచ పరిణామాలు ఆహార ఉత్పత్తుల ధరలు మరింత పెరిగేందుకు దారితీస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. భారత్‌లోని వర్తకవ్యాపారులు గోధుమ దిగమతుల కోసం ఇతర దేశాల వైపు చూస్తున్నారు.
వామ్మో...వంటనూనె
మనదేశీయ అవసరాలకు సరిపడా వంట నూనె దేశీయంగా ఉత్పత్తి కావటం లేదు. దిగుమతులపై ఆధారపడ్డాం. ఉక్రెయిన్, రష్యా నుంచి పెద్ద మొత్తంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అయ్యేది. ఉక్రెయిన్ సంక్షోభంతో మొత్తం మారిపోయింది. ఆ రెండు దేశాల నుంచి కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇతర దేశాల్లో కొందామంటే లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా, బ్రెజిల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పంట దిగుబడులు పడిపోయాయి. బ్రెజిల్లో మొక్కజొన్న దిగుబడి అనూహ్యంగా పడిపోయింది.
ఇండోనేషియా నిషేధం
భారత్‌లో వంట నూనె ధరలు మంటెక్కుతున్నాయి. లీటర్ ప్యాకెట్ ధర రూ.200కు చేరుకుంది. దీనికి తోడు ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది. భారత్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ముడి పామాయిల్లో 45శాతం, రిఫైన్డ్ పామాయిల్లో 70శాతం మనదేశానికి ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతోంది. ఈనేపథ్యంలో దేశీయంగా వంటనూనె ధరలు హఠాత్తుగా మారిపోయాయి. పామాయిల్ కోసం మనదేశంలోని దిగుమతిదారులు ఇతర దేశాల వైపు చూస్తున్నారు.
మనదేశ వంట నూనె కష్టాలు పామాయిల్కే పరిమితం కాలేదు. మనదేశ అవసరాల్లో 70శాతం ఉక్రెయిన్ నుంచి దిగుమతుల ద్వారా తీర్చుకుంటున్నాం. యుద్ధం వల్ల ఒక టన్ను సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ధర రూ.38 వేలు పెరిగింది. సోయా ఆయిల్ ధర రూ.23వేలు పెరిగింది. ఉక్రెయిన్ నుంచి దిగుమతులపై దెబ్బపడటంతో భారత వ్యాపారులు ఇండోనేషియా నుంచి తెప్పించారు. ఇప్పుడు ఆ దేశం నిషేధం విధించేసరికి, అర్జెంటీనా నుంచి తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అన్నింటిపైనా ప్రభావం
కాస్మెటిక్స్, బయోడీజిల్, ప్రాసెస్డ్ ఫుడ్‌లలో పామాయిల్ విపరీతంగా ఉపయోగిస్తారు. మార్కెట్లో నెలకొన్న పరిస్థితి కారణంగా వాటి ధరలు పెరిగే అవకాశముంది. అలాగే రెస్టారెంట్స్, చిన్న హోటల్స్‌పైనా ప్రభావముంటుంది. అలాగే రసాయన పరిశ్రమల్లో తయారయ్యే పెయింట్స్ ధరలు పెరగవచ్చు. ఏదేమైనా దేశంలో పామాయిల్ కొరత కేవలం ఆహార పదార్థాలకే పరిమితం కాదు. అనేక ఉత్పత్తుల ధరలు పెరిగిపోతాయి. దీనికి మొదటి సంకేతం గతకొన్ని వారాలుగా పామాయిల్ ధర మార్కెట్లో క్రమంగా పెరుగుతూనే ఉంది.