Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోవధ చేస్తున్నారని ఇద్దరు గిరిజనులపై దాడి
- దాడిలో ఒకరు మృతి
న్యూఢిల్లీ : గోరక్షక దళాల పేరుతో దేశంలో జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గోపరిరక్షణ, గోవుల వధ, కబేళాల తరలింపు..అనే ఆరోపణలతో అమాయకులపై దాడులు పెచ్చుమీరు తున్నాయి. గతకొన్నేండ్లుగా హిందూత్వ మూకలు గోపరిరక్షణ పేరుతో రెచ్చిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో సెయిని జిల్లా సిమరియా ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో దాడి ఘటన చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు ఇద్దరు గిరిజన వ్యక్తులను తీవ్రంగా కొట్టి..ఒక అమాయకుడి చావుకు కారణమయ్యారు. గోవుల కబేళాల్ని తరలిస్తున్నారన్న నెపంతో ఈ దాడి జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇదే ఘటనలో మరోక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని కొట్టి చంపింది..భజరంగ్‌దళ్ కార్యకర్తలేనని కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 20మంది వ్యక్తులు కర్రలు, ఇతర బలమైన ఆయుధాలతో దాడిచేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా, ముగ్గురు అనుమానితుల్ని ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నామని మిగతా వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసు అధికారి మారావి తెలిపారు.