Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు గిరిజనుల హత్య
- గోవధ అనుమానంతో కొట్టి చంపిన తీరు
న్యూఢిల్లీ : బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్లో హిందూత్వ శక్తులు రెచ్చిపోయాయి. ఆవును చంపారన్న అనుమానంతో ఇద్దరు గిరిజనులను స్థానిక మూక కొట్టి చంపింది. ఈ ఘటనలో మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సియోని జిల్లాలోని కురై పోలీసుస్టేషన్ పరిధి కిందకు వచ్చే సిమరియాలో ఈ ఘటన చోటు చేసుకున్నది. దాదాపు 15 నుంచి 20 మంది వరకు కొట్టడంతో ఆ ఇద్దరు చనిపోయారు. వీరిపై కేసు నమోదైంది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన వెనక ఉన్నది బజరంగ్దళ్ కార్యకర్తలే అని ఆరోపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అర్జున్ సింగ్ కకోడియా నేతృత్వంలోని కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు జబల్పూర్-నాగ్పూర్ రహదారిపై నిరసనకు దిగారు. సియోని ఎస్పీ, ఇతర అధికారులు ఘటనా ప్రదేశాన్ని సందర్శించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి, ఫిర్యాదుదారు అయిన బ్రజేష్ బట్టి మాట్లాడుతూ.. నిందితులు సంపత్ బట్టి, ధన్సాలను కర్రలతో తీవ్రంగా కొట్టారని చెప్పాడు. ఆ సమయంలో అక్కడి చేరుకున్న తన పైనా దాడి చేశారని వివరించాడు. బాధిత కుటుంబీకులకు రూ. 1 కోటి చొప్పున పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమల్ నాథ్ ట్వీట్ చేశారు. గిరిజనులపై దాడులు జరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ముందుస్థానంలో ఉన్నదని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) సమచారాన్ని ఆయన ఉటంకించారు.