Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అక్రమ నిర్మాణాల పేరుతో ఢిల్లీలో మళ్లీ ఇళ్ల కూల్చివేత కార్యక్రమం ప్రారంభమయింది. బీజేపీ అధికారంలో ఉన్న దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) దీనిని ప్రారంభించింది. సుదీర్ఘకాలం సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు జరిగిన షాహీన్ బాగ్ ప్రధాన రహదారితో సహా కాళింది కుంజ్, ఎంబి రోడ్డు, మెహర్‌చాంద్ మార్కెట్, శ్రీనివాస్ పురి, ఖద కాలనీల్లో ఇండ్లు కూల్చివేస్తామని అధికారులు చెప్పారు. 10 రోజుల కార్యచరణతో ఇండ్లు కూల్చివేత కొనసాగనుంది. బుధవారం ముందుగా సంగం విహార ప్రాంతంలోని ఎంబీ రోడ్డులో కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ వద్ద బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేత ప్రాంభమయింది. ఈ నెల 13 వరకూ వివిధ ప్రాంతాల్లో కూల్చివేత కొనసాగనుందని ఎస్డీఎంసీ చైర్మన్ (సెంట్రోల్ జోన్) రాజ్‌పాల్ సింగ్ తెలిపారు. షాహీన్ భాగ్ ప్రధాన రహదారి, కాళింది కుంజ్, ఎంబి రోడ్డు, మెహర్‌చాంద్ మార్కెట్, శ్రీనివాస్ పురి, ఖద కాలనీల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని చెప్పారు. 'షాహీన్ బాగ్‌తో సహ పలు ప్రాంతాల్లో 10 రోజుల కార్యచరణ ప్రణాళికతో కూల్చివేతలకు సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమం కొసాగించడానికి అవసరమైన పోలీసు సిబ్బంది సహాయం కోరాం. ఈ నెల 9న షాహీన్‌బాగ్‌లో ఇళ్లు కూల్చివేస్తాం' అని సింగ్ వెల్లడించారు. ఎస్‌డిఎంసి పరిధిలో ఉన్న షాహీన్‌బాగ్ సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలతో వెలుగులోకి వచ్చింది. కాగా, ఢిల్లీలో ఈ కూల్చివేతలు ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా లేఖతో ప్రారంభమాయ్యయి. ఏప్రిల్ 20న దక్షిణ, తూర్పు కార్పొరేషన్ల మేయర్లకు రాసిన లేఖలో ఈ ప్రాంతాల్లో 'రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, సంఘ వ్యతిరేక శక్తుల' ఆక్రమణలను తొలగించాలని ఆదేశ్ గుప్తా కోరారు. దీంతో ఏప్రిల్‌లో ఓఖ్లా, జసోలాలో ఈ కూల్చివేతలకు ప్రణాళికలు వేశారు. అయితే తగిన పోలీసు బలగాలు అందుబాటులో లేనందున అది అమలు కాలేదు. అలాగే నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ)లోని జహంగీర్‌పురి ప్రాంతంలో మతఘర్షణలు జరిగిన నాలుగు రోజుల తర్వాత కూల్చివేతలు జరపడం దేశవ్యాప్తంగా అనేక విమర్శలకు దారితీసింది. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని యథాతథ స్థితిని కొనసాగించాలని ఎన్డీఎంసీని ఆదేశించింది.