Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందువల్లే మీడియా స్వేచ్ఛలో భారత్ ర్యాంక్ పడిపోయింది : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : గత 8ఏండ్లుగా మోడీ సర్కార్ అనుసరిస్తున్న అణచివేత ధోరణి, అప్రకటిత ఎమర్జెన్సీ వల్లే నేడు పత్రికా స్వేచ్ఛలో భారత్ స్థాయి పడిపోవడానికి దారితీసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌లో ప్రజాస్వామ్య హక్కులపై, పౌర హక్కులపై దాడి బలంగా కొనసాగుతోందని 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' వారి 'వరల్డ్ ప్రెస్ ఇండెక్స్'లో స్పష్టంగా బహిర్గతమైంది. 2016లో 133వ స్థానంలోఉన్న భారత్ ర్యాంక్, 2021నాటికి 150కు పడిపోయింది. మీడియా స్వేచ్ఛ పాలకుల నిర్బంధాన్ని ఎదుర్కొంటోందని, క్షేత్రస్థాయిలో నిలబడటానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, అందువల్లే భారత్ ర్యాంక్ పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు.
జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పన్‌ను రకరకాల కేసులతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జైల్లో నిర్బంధించి 575రోజులు దాటింది. హత్రాస్‌లో ఒక దళిత మహిళపై లైంగిక దాడి, హత్య ఘటన వార్తను రిపోర్ట్ చేయడానికి వచ్చిన కప్పన్‌ను యూపీ ప్రభుత్వం జైల్లో పెట్టింది. అలాగే 'కాశ్మీరీవాలా' ఎడిటర్ ఫాహద్ షాను శ్రీనగర్ జైల్లో నిర్బంధించి మూడు నెలలు దాటుతోంది. సాజద్ గుల్ అనే మరో జర్నలిస్టునూ కేంద్రం జైల్లో నిర్బంధించింది. జమ్మూకాశ్మీర్‌లో జర్నలిస్టులను ప్రజాభద్రతా చట్టం కింద, యూపీలో కప్పన్లాంటి జర్నలిస్టులను 'ఉపా' చట్టం కింద క్రిమినల్ ఆరోపణలు చేస్తూ పాలకులు అరెస్టు చేయిస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా కథనాలు రాస్తున్న మీడియా గొంతును నొక్కేస్తున్నారు. మోడీ హయాంలో జర్నలిస్టుల అరెస్టులు పెరిగాయి. తమకు వ్యతిరేకంగా వార్తాకథనాలు రాస్తున్నారని వేలాదిమందిపై బీజేపీ ప్రభుత్వాలు తప్పుడు క్రిమినల్ కేసులు బనాయిస్తున్నాయి. పెగాసస్ వంటి నిఘా సాఫ్ట్‌వేర్‌తో ప్రముఖ జర్నలిస్టులపై నిఘా చర్యలు చేపడుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో జర్నలిస్టులపై భౌతిక దాడులకు లెక్కేలేదు. కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలతో మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దాడులు చోటుచేసుకున్నాయి. ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి, ఎలాంటి అణచివేత చర్యలకు పాల్పడిందో అందరికీ తెలుసు. అదే అణచివేత, దాడులు.. అప్రకటిత ఎమెర్జెన్సీ ద్వారా మోడీ సర్కార్ అమలు జేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకోవైపు ప్రధాన మీడియాలోని ఒకవర్గంతో మోడీ సర్కార్ అనుకూల ప్రచారం చేసుకుంటోందని, ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదని విమర్శలున్నాయి.