Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోపెన్హేగన్లో బిజీ బిజీగా...
- నార్వే, ఫిన్లాండ్, స్వీడిష్ ప్రధానులతో మోడీ చర్చలు
- భారత్‌లో అవకాశాలను ఉపయోగించుకోవాలని పిలుపు
కోపెన్‌హేగన్ : ప్రస్తుతం యూరప్ దేశాల పర్యటనలో వున్న ప్రధాని మోడీ బుధవారం కోపెన్హేగన్లో బిజీ బిజీగా గడిపారు. వరుసగా నార్వే, సీడిష్, ఫిన్లాండ్ ప్రధానులతో సమావేశాలు జరిపారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. వాణిజ్యం, అభివృద్ధి సహకారం పెంపుపై దృష్టి సారించారు. పెట్టుబడులు పెట్టి భారత మార్కెట్లో గల అవకాశాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సిందిగా మోడీ కోరారు. తొలుత నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో మోడీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు కూలంకషంగా చర్చించారు. అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు గల మార్గాలపై కూడా చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. బెర్లిన్ నుండి మంగళవారం ఇక్కడకు వచ్చిన మోడీ భారత్-నార్డియాక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ముందుగా స్టోర్‌తో భేటీ అయ్యారు. గతేడాది ప్రధానిగా స్టోర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరువురు నేతలు సమావేశమవడం ఇదే మొదటిసారి. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. సముద్ర ఆర్థిక వ్యవస్థ, పునర్వినియోగ ఇంధనం, హరిత హైడ్రోజన్, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు, హరిత షిప్పింగ్, మత్స్య పరిశ్రమ, నీటి నిర్వహణ, వర్షపు నీటి పరిరక్షణ, రోదసీలో సహకారం, దీర్ఘకాలిక మౌలిక వసతులపై పెట్టుబడులు, ఆరోగ్యం, సాంస్కృతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారానికి గల అవకాశాలను ఇరువురు నేతలు చర్చించారు
నార్వేతో స్నేహ సంబంధాలను పెంపొందించడం లక్ష్యంగా వుందని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. భవిష్యత్తులో సహకారానికి గల అవకాశాలు, రంగాలపై కూడా ఇరువురు ప్రధానులు చర్చించారని విదేశాంగ శాఖ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలుగా భారత్, నార్వేలు ఐరాస వేదికపై పరస్పరం సహకరించుకోవడానికి కృషి చేస్తాయని ఆ ప్రకటన పేర్కొంది. వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలు, డిజిటల్, వినూత్న భాగస్వామ్యం, హరిత భాగస్వామ్యం, ఇతర రంగాల్లో ఆర్థిక సహకారం వంటి నాలుగు ప్రధాన రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై భారత్-నార్డియాక్ దేశాల సమావేశం దృష్టి కేంద్రీకరించనుంది. స్టోర్‌తో చర్చల అనంతరం మోడీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఫిన్లాండ్ ప్రధానితో
అంతకుముందు ఫిన్లాండ్ ప్రధానిసానా మారిన్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఇతర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరుచుకునేందుకు గల అవకాశాలపై ఇరువురు చర్చించారు. వీరిరువురు ముఖాముఖి సమావేశమవడం ఇదే తొలిసారి. వారి సమావేశం ఫలప్రదంగా సాగిందని, కొత్తగా ఆవిర్భవిస్తున్న ఎఐ, 5జి, 6జి, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో సంబంధాలను మరింత విస్తరించుకునేందుకు చర్చలు జరిగాయని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చి ట్వీట్ చేశారు. భారత్‌లో అత్యున్నత సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫిన్లాండ్ వాణిజ్య వర్గాలను మోడీ ఆహ్వానించారు. భారత్ మార్కెట్లో గల అపారమైన అవకాశాలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. అంతర్జాతీయ సంస్థల వేదికలపై పరస్పరం సహకరించుకోవడంపై కూడా చర్చించారు.
స్వీడిష్ ప్రధానితో
స్వీడిష్ ప్రధాని మాగ్దలెనా ఆండర్సన్‌తో భేటీ అయిన మోడీ ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. పలురంగాల్లో చేపట్టిన విస్తృత చొరవలను ముందుకు తీసుకెళ్ళే:దుకు 2018లో రూపొందించిన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో పురోగతిపై, ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు గల అవకాశాలపై చర్చలు జరిపారు.
వినూత్న రంగాలు, సాంకేతికత, పెట్టుబడులపై భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు బగ్చి ట్వీట్ చేశారు. వాతావరణ కార్యాచరణ, రోదసీ, రక్షణ, పౌర విమానయాన, ధృవ పరిశోధన, గనుల తవ్వకాలు, వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకునేందుకు గల మార్గాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు.