Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ బ్యూరో ఢిల్లీ/ హైదరాబాద్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,, కేరళ, తమిళనాడు, కర్నాటక, ఒడిశా, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, అసోం, పశ్చిమ బెంగాల్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి, గుజరాత్, ఉత్తారాఖండ్ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎల్ఐసి బ్రాంచ్, డివిజన్, ప్రధాన కార్యాలయాల వద్ద ఆందోళన జరిగింది. అన్ని రాష్ట్రాల్లో వేలాది మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఐపీఓను వ్యతిరేకిస్తూ ఎల్ఐసీ ఉద్యోగులు ప్లకార్డులను నినాదాల హౌరెత్తించారు. అలాగే గేటు మీటింగ్ లు నిర్వహించారు. కోట్లాది మంది పాలసీదారుల ఆస్తులను ఎక్కువగా కలిగి ఉన్న సంస్థలో ఐపిఓను అందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపింది. ఎల్ఐసి వాస్తవ విలువను తక్కువగా అంచనా వేయడం, పాలసీదారుల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని స్పష్టం చేసింది. ఎల్ఐసీ ఉద్యోగులు, పాలసీదారులు చేస్తున్న పోరాటానికి దేశంలో వివిధ ప్రజా సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు. ఎల్ఐసీలో ఐపీఓను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో...
ప్రయివేటీకరణలో భాగంగా తొలి అడుగుగా ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా ఎల్ఐసీ వాటాల్లో 3.5 శాతం వాటాను స్టాక్మార్కెట్లో అమ్ముతున్నారని విమర్శించారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాలను ప్రతిఘటించాలనీ, ప్రజల్లో వాటిని ఎండగట్టాలని చెప్పారు. ఎల్ఐసీ ఐపీవోను వ్యతిరేకిస్తూ అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఏఐఐఈఏ) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు భోజన విరామానికి ముందు రెండుగంటల వాకౌట్ సమ్మెను నిర్వహించారు. ఉద్యోగులు ప్రదర్శన చేపట్టారు. ఈ సమయంలో ఎల్ఐసీని రక్షించాలి, ప్రజల సొమ్మును కాపాడాలి, ఎల్ఐసీ ఐపీవోని వ్యతిరేకించాలి, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలి'అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) హైదరాబాద్ డివిజన్ అధ్యక్షులు ఎన్ ఆదీశ్రెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్మిశ్రా మాట్లాడుతూ ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులను పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎల్ఐసీలో తన వాటాల్లోని 3.5 శాతం వాటాలను స్టాక్ మార్కెట్లో హడావుడిగా అమ్మడాన్ని తీవ్రంగా ఖండించారు. పాలసీదార్ల ప్రయోజనాలను తొక్కిపెడుతూ మదుపుదార్ల ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని విమర్శించారు. ఎల్ఐసీకి సంబంధించి ఎంబెడెడ్ విలువ (రూ.5.4 లక్షల కోట్లు)ను మూడు రెట్లు పెంచాల్సి ఉండగా, 1.1గా నిర్ణయించారని చెప్పారు. దీంతో రూ.16 లక్షల కోట్లు ఉండాల్సిన మార్కెట్ విలువ కేవలం రూ.ఆరు లక్షల కోట్లుగా మారిందన్నారు. అందుకే రూ.రెండు వేలకుపైగా ఉండాల్సిన షేరు విలువ రూ.900 నుంచి రూ.950గా ఉందని వివరించారు. దీంతో సామాన్య మదుపుదార్ల నుంచి బడా పెట్టుబడిదార్ల వరకు త్వరగా ఈ వాటాలను చేజిక్కించుకునే కుట్ర దాగి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల ద్వారా ఎల్ఐసీకి చెందిన రూ.లక్షల కోట్ల ఆస్తులు, ప్రజల పొదుపు సొమ్ము కొద్దిమంది ఆశ్రిత పెట్టుబడిదారులకు అప్పనంగా దోచిపెట్టే కుట్రలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతున్నదని విమర్శించారు. రాబోయే కాలంలో తమ సంఘ సభ్యులు, ఉద్యోగులు, పాలసీదా రులు, ప్రజల ప్రయోజనాల కోసం ఎల్ఐసీని కాపాడుకునేం దుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐఐఈఏ అధ్యక్షులు వి రమేష్ మాట్లా డుతూ ఎల్ఐసీలో స్పెక్ట్రం తరహాలో భారీ కుంభకోణం జరిగిందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, బీఎంఎస్ ఎల్ఐసీ పరిరక్షణ కోసం కాకుండా అంబానీ, అదానీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని చెప్పారు. ఎల్ఐసీ ప్రయివేటీకరణ ఆపాలంటూ హనుమాన్ చాలీసా చదివితే అందులో తామూ పాల్గొంటామని అన్నారు. ఏఐఐ ఈఏ మాజీ ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ ఎల్ఐసీని ప్రయివేటీకరించడం కష్టమని భావించిన పాలకులు ప్రయివేటు ఇన్సూరెన్స్ సంస్థలను తెచ్చారని గుర్తు చేశారు. అయినా ఎల్ఐసీ ప్రతిష్ట దిగజారలేదనీ, అందుకే వాటాలను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వపు అనైతిక చర్యలకు వ్యతిరేకంగా ఎల్ఐసీ పరిరక్షణ కోసం ఉద్యోగులు ధర్మపోరాటం చేస్తున్నారని ఎస్సీజెడ్ఐఈఎఫ్ ప్రధాన కార్యదర్శి టివిఎన్ఎస్ రవీంద్రనాథ్ అన్నారు. ఎల్ఐసీ ఐపీవో దేశచరిత్రలోనే పెద్ద కుంభకోణమంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయని చెప్పారు. ప్రజల సొమ్ముతో ఏర్పడిన ఈ సంస్థను ప్రయివేటుపరం చేసే హక్కు ప్రభుత్వానికి లేద న్నారు. సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్య దర్శి ఎం వెంకటేశ్ మాట్లాడుతూ దేశంలో బుల్డొజర్ రాజ్యం నడుస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐసీఈ యూ హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జి తిరుప తయ్య, ఆర్బీఐఈఏ కార్యదర్శి హరీశ్, ఆర్బీఐ నాలుగో తర గతి ఉద్యోగుల సంఘం నాయకులు రాజీవ్, రిటైర్డ్ ఇన్సూ రెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు శ్రీరామ్, సీఐటీయూ నగర నాయకులు కామేశ్బాబు, ఎస్సీజెడ్ఐ ఈఎఫ్ హైదరాబాద్ డివిజన్ వర్కింగ్ ఉమెన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ పి సుజాత తదితరులు పాల్గొన్నారు.