Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన బాంబే హైకోర్టు
ముంబయి : బీమా కొరెగావ్ హింస కేసులోని 8మంది నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. తమకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి తిరస్కరిస్తూ గతంలో పూనే సెషన్స్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ వరవర రావు సహా మరో ఏడుగురు మానవ హక్కుల కార్యకర్తలు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని కొట్టివేస్తూ హైకోర్టు, ఆ ఆదేశాలపై సమీక్షించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆ బెయిల్ ఆదేశాల్లో ఎలాంటి దోషం లేదని, అందువల్ల వాటిని సమీక్షించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. తమ డిఫాల్ట్ బెయిల్ విజ్ఞప్తులను తిరస్కరిస్తూ 2019 సెప్టెంబరు 5న సెషన్స్ న్యాయమూర్తి కె.డి.వదానె జారీ చేసిన ఆదేశాలను వీరు సవాలు చేశారు. సెషన్స్ కోర్టుకు ఈ కేసును అప్పగించిన మేజిస్ట్రేట్ కోర్టు ముందు చార్జిషీట్ దాఖలు చేయనందున ఆ ప్రాతిపదికన తమకు బెయిల్ ఇవ్వాలని వారు ఇప్పుడు కోరుతున్నారు. కాగా, పొడిగించిన గడువు సమయంలోనే చార్జిషీట్‌ను దాఖలు చేసినందున నిందితులు డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులు కారని మహారాష్ట్ర అడ్వకేట్ జనర్ అశుతోష్ కుంభకోని వాదించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనీల్ సింగ్ వాదిస్తూ, డీఫాల్ట్ బెయిల్ దరఖాస్తును పరిశీలించడానికి కోర్టుకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సెషన్స్ న్యాయమూర్తి ఇచ్చిన మరే ఇతర ఆదేశాలు సవాలు చేయబడలేదని అన్నారు. రిమాండ్‌ను పొడిగించడమో లేదా ఎన్ఐఎకు బదిలీ చేయడమో జరగాలి, కానీ ఇక్కడ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ఆదేశాలను మాత్రమే సవాలు చేశారని అన్నారు. ప్రత్యేక కోర్టుకు దీన్ని విచారించే అధికారం వుంటుంది కానీ సెషన్స్ కోర్టుకు వుండదని అన్నారు. అంతకుముందు నిందితుల తరపు న్యాయవాది సుదీప్ పస్బోలా వాదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు ఏర్పాటు చేసినందున, ఎన్ఐఎ ఆదేశాల మేరకు ఈ విషయం మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళాల్సి వున్నందున సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలు నిలబడవని వాదించారు.