Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 76 శాతం మంది అండర్‌ట్రయల్స్..!
- వీరిలో 20 శాతం మంది ముస్లింలు, 73 శాతం మంది దళితులు,గిరిజనులు, ఓబీసీలు
- ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లలో అధికం : ఎన్సీఆర్బీ సమాచారం
న్యూఢిల్లీ : భారత్‌లో అండర్‌ట్రయల్స్ ఖైదీల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. ఇది ఏటికేడు పెరుగుతున్నది. ముఖ్యంగా, వీరిలో అధిక శాతం మంది దళిత, గిరిజన, ఓబీసీ, ముస్లిం వర్గాలకు చెందినవారే ఉండటం గమనార్హం. దేశంలో మొత్తం 76 శాతం ఖైదీలు అండర్‌ట్రయల్స్ కావటం గమనార్హం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2020కి సంబంధించి తాజా సమాచారం ద్వారా ఈ విషయం వెల్లడైంది.
68 శాతం మంది నిరక్షరాస్యులే..!
ఈ సమాచారం ప్రకారం.. విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలలో 68 శాతం మంది నిరక్ష్యరాసులు లేదా స్కూల్ డ్రాపౌట్స్ కావటం గమనార్హం. దేశవ్యాప్తంగా మొత్తం 4,88,511 మంది జైలు ఖైదీలలో 3,71,848 మంది అండర్‌ట్రయల్స్ ఉన్నారు. వీరిలో 20 శాతం మంది ముస్లింలు ఉన్నారు. అలాగే, దాదాపు 73 శాతం మంది దళితులు, గిరిజనులు లేదా ఓబీసీలు ఉన్నారు. జైళ్లలో అండర్ ట్రయల్స్ అధిక నిష్పత్తి ఢిల్లీ (91 శాతం), జమ్మూకాశ్మీర్ (91 శాతం) లలో ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్ (85 శాతం), పంజాబ్ (85 శాతం), ఒడిశా (83 శాతం) లు ఉన్నాయి. దాదాపు 27 శాతం మంది నిరక్షరాస్యులున్నారు. 41 శాతం మంది పదో తరగతికి ముందే డ్రాపౌట్లుగా ఉన్నారు.
భారత జనాభాలో ముస్లింల జనాభా శాతం 14 శాతం కాగా.. మొత్తం అండర్‌ట్రయల్స్‌లో 20 శాతంగా వీరు ఉన్నారు. అలాగే, మొత్తం దోషులలో 17 శాతం మంది ముస్లింలు దోషులుగా తేలారు. ఇక దళిత జనాభా శాతం 16.6 శాతంగా ఉన్నది. వీరిలో 21 శాతం మంది అండర్ ట్రయల్స్.. 21 శాతం మంది దోషులుగా ఉన్నారు. ఇక ట్రైబల్స్ పాపులేషన్ 8.6 శాతం. వీరిలో 10 శాతం మంది అండర్ ట్రయల్స్.. 14 శాతం మంది దోషులుగా తేలారు. ఎన్ఎస్ఎస్ఓ డేటా ప్రకారం దేశంలో ఓబీసీల జనాభా 41 శాతం. వీరిలో 42 శాతం మంది ఖైదీలు అండర్‌ట్రయల్స్‌గా ఉన్నారు. మొత్తం దోషుల లో 37 శాతం మంది ఉన్నారు. దాదాపు 30 శాతం మంది అండర్‌ట్రయల్స్ ఏడాదికి పైగా జైలులోనే ఉన్నారు. మరోపక్క, 65 శాతం మంది మూడునెలల ముందు విడుదలకు నోచు కోకపోవటం గమనార్హం. 76 శాతం మంది అండర్ ట్రయల్స్.. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద నేరారోపణలను ఎదుర్కొంటు న్నారు. మిగిలిన వారు ఆయుధ చట్టం, నార్కొటిక్స్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) వంటి ప్రత్యేక, స్థానిక చట్టాలు (ఎస్ఎల్ఎల్) కింద ఆరోపణలను ఎదుర్కొంటు న్నారు. అండర్‌ట్రయల్స్‌లో 60 శాతం మంది ఎస్ఎల్ఎల్ కింద లిక్కర్, డ్రగ్‌కు సంబంధించిన నేరారోపణల్లో ఉన్నారు. అయితే, ఈ అండర్‌ట్రయల్స్ అనేది ఆర్థిక బలానికి సంబంధించిన విషయమనీ, చాలా మంది బెయిల్‌కు అయ్యే ఖర్చునూ భరించలేరని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు.