Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపో రేటు 4.4 శాతానికి చేరిక : ఆర్బీఐ
- ఎగిసిపడుతోన్న ధరల ఎఫెక్ట్
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎట్టకేలకు దేశంలోని అధిక ధరలపై స్పందించింది. అనుహ్యంగా వడ్డీ రేట్లు పెంచడమే ఇందుకు నిదర్శనం. రేపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.4 శాతానికి చేర్చింది. బ్యాంకులకు ఆర్బీఐ విధించే ఈ వడ్డీరేటు ఇది వరకు 4 శాతంగా ఉంది. ఈ నిర్ణయం మే 4వ తేది నుంచే అమల్లోకి రానుంది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన బుధవారం జరిగిన అత్యవసర భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కాగా.. ఈ భారాన్ని బ్యాంక్‌లు తమ రుణ ఖాతాదారులపై మోపనున్నాయి. దేశంలో అమాంతం పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఆర్బీఐ చివరి సారిగా 2018 ఆగస్టులో వడ్డీ రేట్లను పెంచింది. ఆ తర్వాత నుంచి తగ్గిస్తూనే వచ్చింది. పెట్రోల్, డీజిల్ ఇంధన ధరల పెంపునతో రెండు, మూడేండ్లుగా దేశంలో ద్రవ్యోల్బణం ఎగిసిపడుతోంది. గడిచిన కొన్ని నెలలుగా అడ్డూ అదుపు లేకుండా ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఎట్టకేలకు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థలో నగదు సరఫరా తగ్గనుంది. తద్వారా ధరలు కట్టడిలోకి వచ్చే అవకాశం ఉంది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు ద్రవ్యోల్బణాన్ని ఆందోళనకర స్థాయికి చేరుస్తుండటంతో అత్యవసరంగా సమావేశం కావాల్సి వచ్చిందని శక్తికాంత దాస్ తెలిపారు. వృద్థి రేటు అవకాశాలను మెరుగుపర్చటం లేదా స్థిరీకరించాలన్న లక్ష్యంతోనే రేట్ల పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా.. కరోనా సంక్షోభ నివారణకు ప్రకటించిన ఉద్దీపనలను ఆచీతూచీ ఉపసంహరిస్తామన్నారు. ధరలు పెరిగినప్పుడు వడ్డీ రేట్లను పెంచడం దేశ ద్రోహం కాదంటూ ఇటీవల ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి వచ్చే జూన్‌లో ఆర్బీఐ ఎంపీసీ భేటీ జరగాల్సి ఉండగా.. ఓ నెల రోజులు ముందుగానే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
వారిపై భారం..
రెపో రేటు పెంచడంతో దాదాపుగా అన్ని వర్గాల రుణ గ్రహీతలపై వాయిదాల చెల్లింపు (ఈఎంఐ) భారం పడనుంది. గృహ, వ్యక్తిగత, వాహన వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ఇప్పటికే పాత వడ్డీరేటుతో తీసుకున్న వారిపై కూడా ఈ పెంపు భారం పడనుంది. పాత రుణాలపై వడ్డీ రేటు మరో 40 బేసిస్ పాయింట్లు లేదా 40 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా రుణం తీసుకునే వారు అధికంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
డిపాజిటర్లకు మేలు..
ఆర్బిఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియమితులైన తర్వాత ఆర్థిక వ్యవస్థ పరిణామాలతో సంబంధం లేకుండా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చారు. దీంతో బ్యాంక్‌ల్లో డిపాజిట్లు తగ్గాయి. చాలా మంది తమ నగదును ప్రత్యామ్నాయ పెట్టుబడులకు ఉపయోగించారు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, చిట్టీలు, మ్యూచువల్ ఫండ్స్ తదితర వాటిలో పెట్టారు. తాజాగా వడ్డీ రేట్ల పెంపునతో తిరిగి బ్యాంక్‌ల్లోకి డిపాజిట్ల రూపంలో నిధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.