Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన 2018 బీమా కోరెగావ్ అల్లర్ల కేసు నుంచి హిందూత్వ నాయకుడు శంభాజీ భిడే పేరును మహారాష్ట్ర పోలీసులు తొలగించారు. ఈ అల్లర్లలో శంభాజీ పాత్ర లేదని పోలీసులు మహారాష్ట్ర మానవ హక్కుల ముందు దాఖలు చేసిన నివేదికలో పేర్కొన్నారు. ''ఇప్పటి వరకు ఆయనకు (శంభాజీ భిడే)కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారమూ లేదు. దీంతో ఆయన పేరు చార్జీషీటులో చేర్చలేదు'' అని పోలీసులు చెప్పారు. 2018కి సంబంధించిన బీమా కోరెగావ్ అల్లర్లకు సంబంధించి పోలీసులు రెండు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. తమ ప్రసంగాలతో హింసను ప్రేరేపించారన్న ఆరోపణలతో హిందూత్వ నాయకులైన మిలింద్ ఏక్బోట్, శంభాజీ భిడే పేర్లను నిందితులుగా చేర్చారు. ఏక్బోట్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, శంభాజీని మాత్రం ప్రశ్నించటం కానీ, అదుపులోకి తీసుకోవటం కానీ చేయకపోవటం గమనార్హం. శంభాజీ భిడేపై ఉన్న కేసును వెనక్కి తీసుకుంటామని అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు శంభాజీ తరఫు న్యాయవాది మిశ్రా ఆ సమయంలో సమర్పించారు. అది ఇప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు. దీనిపై తాజా స్థితికి సంబంధించిన నివేదికను పోలీసుల నుంచి కోరారు. దీంతో భిడేకు వ్యతిరేకంగా ఉన్న కేసును డ్రాప్ చేసినట్టు కమిషన్కు పూణే గ్రామీణ ఎస్పీ అభినవ్ దేశ్ముఖ్ తెలిపారు. ఈ విషయంపై కమిషన్ ముందు తదుపరి విచారణ జులై 4న జరగనున్నది.