Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలన్ మస్క్ ప్రకటనతో ఆందోళన
- సోషల్ మీడియాలో ఆ పార్టీకి బలం తగ్గే అవకాశం
- వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేలా యత్నం
- చట్టాలను ప్రయోగించైనా గుప్పెట్లో తెచ్చుకునేలా కేంద్రం యోచన : విశ్లేషకులు
సామాజిక మాధ్యమాలను తమ చెప్పుచేతుల్లో ఉంచుకుంటున్న బీజేపీ ఏ విధంగా విద్వేషపు జ్వాలను రగిలిస్తోంది.. హిందూత్వశక్తులు రెచ్చిపోయేలా సహకరిస్తున్న సోషల్ మీడియా, ఇతరులు కనుక వాటికి వ్యతిరేకంగా పోస్టు పెడితే..మోడీ ప్రభుత్వం రాజద్రోహం కేసులు పెడుతోంది. మత విభజన రాజకీయాలతో పబ్బం గడుపుతున్న బీజేపీకి ట్విట్టర్ ప్రకటన షాకేనా?. ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు కాషాయ పార్టీకి మింగుడుపడటం లేదు. చట్టాలను ప్రయోగించైనా సరే తమ గుప్పెట్లోకి తెచ్చుకునేలా కేంద్రం యోచిస్తోందని రాజకీయ,సోషల్ మీడియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను ఎట్టకేలకు చేజిక్కించుకున్నారు. ఇప్పటికే ఈ వార్త అమెరికాను, అక్కడి వ్యాపార సంస్థలను కదిలించింది. ఎందుకంటే, ఇక్కడ సోషల్ మీడియా వెబ్సైట్ దేశీయ రాజకీయాల్లో ఆసక్తికరమైన పాత్రను పోషించింది. ఎంతగా అంటే.. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్విట్టర్ ఆయనపై నిషేధం విధించింది. ఆ సమయంలో ట్విట్టర్ విక్రయానికి సంబంధించిన అనేక చర్చలు అమెరికాలో దారి తీశాయి. ఇప్పుడు ఈ ట్విట్టర్ మాధ్యమం విధానం భారత్‌లో ఎలా ఉండబోతున్నదనేది కూడా ఇక్కడ చర్చకు దారి తీస్తున్నది.
భారత్‌పై ప్రభావం ఎంత?
భారత్, అమెరికా ల మధ్య భిన్నమైన రాజకీయ వాతావరణం ఉన్నది. అలాగే, పోలికలూ ఉన్నాయి. భారత్‌లో ప్రసంగాలు, భావ ప్రకటనా స్వేచ్ఛను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పలు చట్టాలను ఉపయోగిస్తూ నియంత్రిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు ఆరోపించారు. ముఖ్యంగా, కేంద్రంలోని అధికార బీజేపీ హిందూ జాతీయవాదంతో ఆధిపత్యం చెలాయి స్తున్నదన్నారు. '' సోషల్ మీడియాలో ప్రచారంతో ఆ పార్టీ యాక్టివ్‌గా ఉన్నది. వార్తలు నకీలీవైనా.. వాస్తవాలైనా.. వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంతో బీజేపీకి తనకు తానే సాటి అని పలు సందర్భాలలో నిరూపించుకున్నది'' అని చెప్పారు.
2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ నీతి సెంట్రల్ వంటి వెబ్సైట్లను కలిగి ఉన్నది. నితి సెంట్రల్ అధినేత ప్రస్తుతం భారత జాతీయ ప్రసార సంస్థ ప్రసార భారతికి సీఈఓగా ఉన్నారు. అలాగే, బీజేపీకి అనుకూల పోకడలను విస్తరించడానికి, పార్టీ విమర్శకులపై దాడి చేయడానికి '' ఐటీ సెల్''తో ట్విట్టర్లో ఆకట్టుకొనే నెట్‌వర్క్‌ను బీజేపీ రూపొందించింది. దీంతో పశ్చిమ దేశాలలోనే కాదు.. భారత్ వంటి దేశాలలోనూ ట్విట్టర్ ఒక ప్రాముఖ్యతను సంపాదించుకున్నది. రాజకీయ చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలకు అనధికార వేదికగా మారింది.
అయినప్పటికీ, భారత్‌లోని ట్విట్టర్ వినియోగదారులు 1.50 కోట్ల మంది మాత్రమే కావటం గమనార్హం. భారత దేశ జనాభాలో ఇది 1 శాతం అన్నమాట. మోడీ నేతృత్వంలోని బీజేపీ ఎదుగుదలకు ప్రభుత్వ పని తీరు ఏమో కానీ.. సోషల్ మీడియా కీలకమన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మొన్నటి బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్యపై శివసేనను టార్గెట్ చేయడం మొదలు.. నిన్నటి కాశ్మీర్ ఫైల్స్‌తో ఒక వర్గంపై దాడి వరకు.. బీజేపీ ట్విట్టర్ సహాయంతో ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా రాజకీయంగా లబ్దిని పొందిందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ చేజిక్కించుకోవడం, ఆ తర్వాత సోషల్‌మీడియాలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతున్నదనే చర్చ ప్రస్తుతం జరుగుతున్నది. ''వాక్ స్వాతంత్య్రం అనేది పని చేసే ప్రజాస్వామ్యానికి పునాది. ట్విట్టర్ అనేది డిజిటల్ టౌన్ స్క్వేర్. ఇక్కడ మానవాళి భవిష్యత్తుకు కీలక విషయాలు చర్చించబడతాయి'' అని ట్విటర్ కొనుగోలుపై మస్క్ అన్నారు. ముఖ్యంగా, బాట్లను నిర్మూలిస్తాననీ, '' నిజమైన మానవులను ప్రమాణీకరిస్తా'' అని మస్క్ వాగ్దానం చేయటం బీజేపీకి రెట్టింపు ఆందోళనను కలిగిస్తున్నది. ఏదైనా కఠినమైన నో-బాట్ విధానం అమలు జరిగితే అది ట్విట్టర్లో బీజేపీ ఐటీ సెల్ ఉనికిని దెబ్బ తీస్తుందని నిపుణులు తెలిపారు. దేశంలో వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తున్న బీజేపీకి.. మస్క్ ప్రకటన ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. ముఖ్యంగా, అనేక మంది వాటాదార్లతో నడిచే ట్విట్టర్ సంస్థను చేజిక్కించుకొని ప్రయివేటు కంపెనీగా మారబోతున్న ఆ సంస్థకు అధిపతిగా మస్క్ నిర్ణయాలే ఫైనల్ కానున్నాయని నిపుణులు తెలిపారు.
అయితే, అధికార పార్టీగా బీజేపీకి కొన్ని చట్టాల సహాయంతో ఎంతటివారినైనా లొంగదీసుకొనే ఒక ఆయుధం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. అవి ప్రభుత్వానికి విశేషాధికారాలను కల్పిస్తాయనీ, వీటిని ఉపయోగించి ట్విట్టర్ ఉద్యోగులనూ బెదిరించడానికి అధికార పార్టీ వెనకడుగు వేయబోదని వివరించారు. ఇందుకు ట్విట్టర్‌కు గతంలో భారత ప్రభుత్వం పంపిన ఆదేశాలు, ఆ తర్వాత ఆ సంస్థ తలొగ్గిన విధానాన్ని ఈ సందర్భంగా వారు విశ్లేషించారు. అలాగే, సంపన్నుడైన మస్క్.. భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ కలిగిన దేశంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో ట్విట్టర్‌ను ఆయుధంగా ఉపయోగించుకొనే విషయాన్ని కూడా కొట్టిపారేయలేమని విశ్లేషకులు తెలిపారు. కేంద్రంలో అధికారం మారే వరకూ ట్విట్టర్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగవచ్చని అంచనా వేశారు.