Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటీసులు జారీ చేసిన స్పందించరా..?
- కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- రద్దు చేయాల్సిన అవసరంలేదు. కేంద్రం
- సోమవారం నాటికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి
- ఈ కేసులో మరిన్ని వాయిదా ఇవ్వడం సాధ్యం కాదు
- చట్టం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేయాలి : అటర్నీ జనరల్
న్యూఢిల్లీ : బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలు అయిన పిటిషన్లపై ఇంతవరకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పిటిషన్లపై స్పందించాలని కేంద్రానికి గతంలోనే నోటీసులు జారీ చేసినా, సమాధానం ఇవ్వకపోవడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
రాజద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలా? వద్దా? అన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దీనిపై మే 10న విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.
రాజద్రోహ చట్టం 124ఏ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మాజీ మేజరల్ జనరల్ ఎసి వాంబత్కతో పాటు పలువురు గతేడాది జూలైలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హీమాకోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై స్పందించాలని కేంద్రానికి గతంలోనే నోటీసులు జారీ చేసినా.. ఇంతవరకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించింది. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ''లాయర్ల స్థాయిలో సిద్ధమైన డ్రాఫ్ట్ నివేదికకు ఇంకా అథారిటీ స్థాయిలో ఆమోదం లభించలేదు. అందువల్ల సమాధానం చెప్పేందుకు మరింత గడువు అవసరం'' అని ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఈ విచారణను మే 10న మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. వచ్చే సోమవారం నాటికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో మరిన్ని వాయిదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా రాజద్రోహంపై దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి పంపించే అంశంపై అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. దీనికి అటార్నీ జనరల్ స్పందిస్తూ.. ''ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతోందో మీకు తెలుసు. హనుమాన్ చాలిసా చదువుతామని చెప్పిన వారిపైనా రాజద్రోహం కేసులు పెడుతున్నారు. అందువల్ల ఈ చట్టం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేయాలి. అంతేగానీ, దీనిపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు'' అని అభిప్రాయపడ్డారు. సెక్షన్ 124ఎ చెల్లుబాటును సమర్థిస్తూ కేదార్ నాథ్ సింగ్ ఇచ్చిన తీర్పు బాగా ఆలోచించదగినదని, దానిని సమర్థించాల్సిన అవసరం ఉందని ఏజీ వేణుగోపాల్ అన్నారు. సెక్షన్ 124ఎ దుర్వినియోగాన్ని అదుపులోకి తెచ్చామని ఆయన వాదించారు.