Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020లో ప్రాణాలు కోల్పోయినవారు 45 శాతం మంది
- కరోనా విజృంభణతో కోవిడ్ రోగుల పైనే దృష్టి
- సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సమాచారం
న్యూఢిల్లీ : 2020లో దేశంలో కరోనా మహమ్మారి ఉధృతిని ప్రారంభించింది. ఆ సమయంలో కరోనా రోగులకు తప్ప సాధారణ రోగులకు వైద్యం అందటం గగనంగా మారింది. అయితే, ఆ ఏడాదిలో దాదాపు 45 శాతం మంది వైద్యం అందకపోవటంతో మరణించారు. వీరి సంఖ్య 36.5 లక్షలుగా ఉన్నది. రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సమాచారంలో ఈ విషయం వెల్లడైంది.
ఈ సమాచారం ప్రకారం.. వైద్యమందక మరణాలు చోటు చేసుకోవడం ఇదే అత్యధికం కావటం గమనార్హం. 2020లో మొత్తం 81.2 శాతం మరణాలు నమోదయ్యాయి. ఇందులో 45 శాతం వైద్యానికి నోచుకోక మరణించటం ఆందోళనకరం. 2019లో ఈ సంఖ్య 34.5 శాతంగా ఉన్నది. అంటే 2019లో 76.4 లక్షలుగా ఉన్న మొత్తం మరణాలు.. 2020 నాటికి 6.2 శాతం పెరగుదలను నమోదు చేసి 81.2 లక్షలుగా రికార్డయ్యింది. అయితే, కరోనా కారణంగా ఎన్ని మరణాలు జరిగాయన్న విషయాన్ని ఈ సమాచారం వెల్లడించలేదు.
2020లో కరోనా విజృంభించిన సమయంలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికే ప్రాధాన్యతనిచ్చిన విషయం తెలిసిందే. ఆస్పత్రుల్లో 80 శాతం వరకు బెడ్లను కరోనాతో బాధపడుతున్నవారికే కేటాయించారు. దీంతో అప్పట్లో ఇతర రోగాలతో అవస్థలు పడుతున్న రోగులకు వైద్యం అందలేకపోయింది. 2020లో కరోనా తీవ్రంగా విజృంభణ సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు 5.05 లక్షల ఎమర్జెన్సీయేతర సర్జరీలు ఆలస్యమయ్యాయి. చాలా వరకు ప్రయివేటు ఆస్పత్రులైతే కరోనా విజృంభణ భయంతో రోగులను తిప్పి పంపించాయి.