Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రొఫెసర్, మానవహక్కుల కార్యకర్త జిఎన్. సాయిబాబ అరెస్ట్... దేశానికే అవమానకరమని బుకర్ ప్రైజ్ గ్రహీత అరుంధతీ రారు తెలిపారు. ప్రస్తుత భారతదేశాన్ని వెనక్కి ప్రయాణిస్తున్న విమానంతో పోల్చారు. ఇది కచ్చితంగా వినాశనానికే దారితీస్తుందని అన్నారు. భారత్ తిరోగమనం వైపు వెళుతోందని, వినాశనం తప్పదని హెచ్చరించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జి.ఎన్. సాయిబాబా రచించిన కవితలు, లేఖలతో ''వై డు యు ఫియర్ మై వే సో మచ్'' అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకాన్ని జి.ఎన్.సాయిబాబ భార్య వసంత బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరుంధతీరారు ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడారు. 1960 దశకంలో భూమి, సంపదలను పేదలకు పంచిపెట్టేందుకు నేతలు విప్లవాత్మక ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తుచేశారు. విమానంలో మీరు వెనక్కి ప్రయాణించగలరా అని ఇటీవల ఒక పైలెట్ స్నేహితుడిని అడిగాననీ.. అందుకు ఆయన పెద్దగా నవ్వారనీ.. కానీ ప్రస్తుతం భారత్లో అదే పరిస్థితి ఉందని అన్నారు. మన రాజకీయ నేతలు విమానంలో వెనక్కు ప్రయాణిస్తున్నారనీ, దీంతో అన్ని క్షీణిస్తున్నాయనీ, ఇది వినాశనానికి దారితీస్తుందని అన్నారు. అత్యాధునిక న్యాయశాస్త్రానికి పుట్టినిల్లైన భారత్లో... ప్రస్తుతం కులం, జాతి, మతం, ధనిక, పేద తరగతులు, స్త్రీ, పురుషుల ఆధారంగా చట్టాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.
90శాతం పక్షవాతంతో కదలలేని స్థితిలో, ఏడేండ్లుగా జైలులో మగ్గుతున్న ప్రొఫెసర్ గురించి చర్చిస్తున్నామనీ.. ఎలాంటి దేశంలో జీవిస్తున్నామో చెప్పడానికి ఇది చాలని అన్నారు. ఇది దేశానికి అవమానకరం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుంధతీ రారు రచనల్లో ''ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్'', ''ది మినిస్టరీ ఆఫ్ అట్మోస్ట్ హాపీనెస్'' నవలలు పుస్తకప్రియులను ఆకట్టుకున్నాయి.