Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న చెన్నై కోర్టు
చెన్నై : జై భీమ్ చిత్ర నటులు సూర్య ఆయన భార్య జ్యోతికలతో సహా చిత్ర నిర్మాతలపై వన్నియార్ సంస్థ చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, వేలాచెరి పోలీసులను ఆదేశించింది. వన్నియార్ కమ్యూనిటీ విశ్వాసాలను, వారి మనోభావాలను ఈ చిత్ర నిర్మాతలు దెబ్బతీశారని ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. వేలాచెరిలోని రుతరా వన్నియార్ సేన వ్యవస్థాపకుడు, న్యాయవాది కె.సంతోష్ నైకర్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. వన్నియార్ల నేత గురు గిరిజనులకు అన్యాయం చేసేవారిగా సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించారని, తద్వారా వన్నియార్ కమ్యూనిటీ అక్రమాలకు పాల్పడవారిలా చిత్రీంచారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందూవాదానికి, వన్నియార్లకు వ్యతిరేకంగా విద్వేషం పెంచేలా, మత సామరస్యత దెబ్బతినేలా అందులో సన్నివేశాలు వున్నాయని ఫిర్యాదు పేర్కొంటోంది. ఇటువంటి తప్పుడు సన్నివేశాలు చిత్రీకరించినందుకు చిత్ర నిర్మాతలపై ఐపిసిలోని పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టును కోరారు. కోర్టు ముందుంచిన రికార్డులను పరిశీలించిన అనంతరం కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద సూర్య దంపతులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.