Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూకు 43, కాశ్మీర్‌కు 47 నియోజకవర్గాలు
- తొమ్మిది ఎస్టీ రిజర్వ్ స్థానాలు
- ప్రతిపాదించిన జమ్మూ కాశ్మీర్ డిలిమినేషన్ కమిషన్
- కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి అమలులోకి రానున్న డీలిమిటేషన్
న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయింది. డీలిమిటేషన్ కమిషన్ తన పదవీ కాలం పూర్తయ్యేందుకు ఒకరోజు ముందే పని పూర్తి చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ రంజనా దేశారు నేతృత్వంలోని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కమిషనర్ కెకె శర్మలతో కూడిన జమ్మూకాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ఆర్డర్‌ను ఖరారు చేసింది. ముగ్గురు సభ్యుల కమిషన్ తుది ఆర్డర్స్‌పై సంతకాలు చేశారు. నియోజకవర్గాల సంఖ్య, విస్తీర్ణం వంటి వివరాలతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్డర్ కాపీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి డీలిమిటేషన్ అమలులోకి వస్తుంది.
డీలిమిటేషన్ చట్టం - 2002లోని సెక్షన్ 9(1)(ఎ), సెక్షన్ 60(2)(బీ)లోని నిబంధనలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల పునర్విభజన చేసినట్టు కమిషన్ తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని అసెంబ్లీ స్థానాల సంఖ్యను 83 స్థానాల నుంచి 90 స్థానాలకు పెంచాలని కమిషన్ ప్రతిపాదించింది.
అందులో 43 జమ్మూ ప్రాంతానికి, 47 కాశ్మీర్ ప్రాంతానికి కేటాయిస్తూ ప్రతిపాదించింది. జమ్మూలో 6 స్థానాలు, కాశ్మీర్లో 1స్థానం కమిషన్ అదనంగా ప్రతిపాదించింది. చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ)కు 9 సీట్లు కేటాయించింది.
అసోసియేట్ సభ్యులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు, పౌర సమాజ సమూహాలతో సంప్రదింపులు జరిపిన తరువాత తొమ్మిది స్థానాలు ఎస్టీ రిజర్వ్ చేయబడ్డాయని తెలిపింది. వీటిలో 6 జమ్మూ ప్రాంతంలోనూ, 3 కాశ్మీర్ లోయలో ఉన్నాయని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ కమిషన్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించింది. అందువల్ల, లోయలోని అనంతనాగ్ ప్రాంతాన్ని, జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్‌లను కలిపి పార్లమెంటరీ నియోజకవర్గం ఒకటి రూపొందించింది. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సమాన సంఖ్యలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయని కమిషన్ తెలిపింది. స్థానిక ప్రజా ప్రతినిధుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని నియోజకవర్గాల పేర్లను కూడా మార్చింది.
శాసనసభలో కశ్మీరీ వలసదారుల వర్గం నుంచి కనీసం ఇద్దరు సభ్యులను (వారిలో ఒకరు స్త్రీ అయి ఉండాలి) నామినేట్ చేయాలి. అటువంటి సభ్యులకు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభ నామినేటెడ్ సభ్యుల అధికారంతో సమానంగా అధికారం ఇవ్వవచ్చు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి స్థానభ్రంశం చెందిన వ్యక్తుల ప్రతినిధులను నామినేట్ చేయాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగిందని తెలిపింది. దాని ప్రకారమే ఎస్టీ, ఎస్సీ రిజర్వ్ స్థానాలు కేటాయించినట్లు తెలిపింది. ఏడు ఎస్సీ, తొమ్మిది ఎస్టీ రిజర్వ్ స్థానాలు కేటాయించినట్లు పేర్కొంది. కమిషన్ మొత్తం 20 జిల్లాలను మూడు వర్గాలుగా వర్గీకరించింది. జమ్మూ కాశ్మీర్ లోని అసెంబ్లీ స్థానాలు పునర్విభజన చివరిగా 1981 జనాభా లెక్కల ఆధారంగా 1995లో జరిగింది.
నిర్వీర్యం చేయడానికే: సీపీఐ(ఎం)
దీర్ఘకాలంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలను నిర్వీర్యం చేయడానికి డీలిమిటేషన్ కసరత్తు జరిగిందని సీపీఐ(ఎం) విమర్శించింది. ఈ మేరకు గురువారం సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు యూసఫ్ తరిగామి తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపుదల, తగ్గింపుపై రాజ్యాంగ స్తంభన ఉన్నప్పటికీ డీలిమిటేషన్ కమిషన్ తన తుది నివేదికను సమర్పించిందని విమర్శించారు. 2002 నాటి డీలిమిటేషన్ చట్టం ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైనప్పటికీ, జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019 నిబంధనలకు అనుగుణంగా సుప్రీం కోర్టులో సవాలు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి శాశ్వత నివాసితులకు మాత్రమే పరిమితం చేయబడిన ఓటింగ్ హక్కులు రాష్ట్రేతరలకు కూడా విస్తరించాయని తెలిపారు.
అంగీకరించబోం: మెహబూబా ముఫ్తీ, పీడీపీ
డీలిమిటేషన్ ప్రక్రియపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని ఎంత మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రజల ఇష్టాఇష్టాలు రాజకీయ పార్టీల అభిప్రాయాలతో సంబంధం లేకుండా బీజేపీ ఆదేశాలతో ఈ డీలిమిటేషన్ జరిగిందని ముఫ్తీ విమర్శించారు.