Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెహ్రాడూన్ : మత సామరస్యానికి చిహ్నంగా ఉత్తరాఖండ్‌లో ఒక ఘటన జరిగింది. రూ.1.5 కోట్ల విలువైన సుమారు 62 సెంట్లు (నాలుగు బిగాలు) స్థలాన్ని ఈద్గా ప్రార్థనల కోసం ఇద్దరు హిందూ సోదరీమణులు దానం చేశారు. ఈద్ రోజున మరణించిన తన తండ్రి చివరి కోరికను తీర్చేందుకు ఆ స్థలాన్ని ముస్లింల ప్రార్థన కోసం ఇచ్చినట్టు వారు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ అనే చిన్నపట్టణంలోని ఖాసిపూర్ ప్రాంతంలో తరచూ మత ఉద్రిక్తతలు జరుగుతూ ఉంటాయి. అటువంటి ప్రాంతంలో మతాలకు అతీతంగా వీరు తమ స్థలాన్ని ముస్లిం సోదరులకు దానం చేయడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. 2003 జనవరిలో బ్రజందన్ ప్రసాద్ రస్తోగి మరణించారు. ఆ సమయంలో సుమారు 62 సెంట్ల తన పంట పొలాన్ని ముస్లింల ఈద్గా ప్రార్థనలకు ఇవ్వాలనీ, అది తన చివరి కొరికని బంధువులకు తెలిపారు. ఢిల్లీ, మీరట్‌లలో నివసించే సరోజ, అనితలు బంధువుల ద్వారా తండ్రి చివరి కోరికను తెలుసుకున్నారు. ఖాసిపూర్లో నివసించే తమ సోదరుడు రాకేష్ రస్తోగితో సంప్రదించి ఆ భూమిని ముస్లింలకు ఇచ్చారు. తన ఇద్దరు సోదరీమ ణులు మత సామరస్యానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారని రాకేష్ రస్తోగి తెలిపారు. ఆ ఇద్దరు సోదరీమణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈద్గా కమిటీకి చెందిన హసిన్ ఖాన్ తెలిపారు.