Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య పోరాటాలే నియంతృత్వ ప్రభుత్వాలను నిలువరించగలవు: వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్
న్యూఢిలీ : భూమి, ఉపాధి, నివాసం, సామాజిక వివక్ష, విద్య, వైద్యంకోసం విశాల ఉద్యమాలు, ఐక్య పోరాటాలే నియంతృత్వ ప్రభుత్వాలను నిలువరించగలుగుతాయని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. శ్రామికవర్గ విముక్తి కోసం విశాల దృక్పథంతో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 1980లో స్థాపించటం జరిగిందని తెలిపారు. నాడు దేశంలో శ్రామికవర్గం తరఫున పోరాడుతున్న అనేకమంది పోరాటయోథులు కలిసి ఈ సంఘాన్ని నిర్మించారని గుర్తుచేశారు. బీహార్లోని భాగల్పూర్లో వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. భాగల్పూర్, దర్భంగా మొదలైన ప్రాంతాల్లో భూమి, ఉపాధి, వేతనాలు, పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, కనీస వసతుల కోసం, సామాజిక అసమానతల నిర్మూలన కోసం సమరశీల ఉద్యమాలు సాగాయని గుర్తుచేశారు. అటువంటి పోరాటాల్లో వీరోచితంగా నిలబడిన యోధుల్లో ఒకరైన సారంగధర పాశ్వన్ (92)ను వెంకట్ కలిసారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ సారంగధర పాశ్వాన్ దేశంలో అఖిల భారత సంఘం నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ కార్మికులు, కష్టజీవుల విముక్తి కోసం అనేక ఉద్యమాలు సాగాయని వివరించారు. ఆ పోరాటాల ఫలితంగా పేదలకు వేలాది ఎకరాల భూములను అందించటం జరిగిందనీ, తద్వారా వారు తల ఎత్తుకు తిరిగే పరిస్థితి కలిగిందని అన్నారు. నేటికీ ఆ ప్రాంతంలో లాల్ జెండా పేదల హదయాల్లో పదిలంగా ఉందని ఆ వారసత్వం నేటికీ కొనసాగుతుందని అన్నారు. మరోవైపు పాలకవర్గాలు పేదలను ఓటుబ్యాంకు రాజకీయాలతో మోసపుచ్చుతున్నారని, అరకొర సంక్షేమ పథకాలు, ఆర్భాటపు ప్రచారంతో, మోసపుచ్చే మాటలతో ప్రజా పోరాటాలను విచ్ఛిన్నం చేస్తూ పేదలను ఐక్యం కాకుండా అడ్డుకుంటున్నాయని అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వామపక్ష ప్రజాతంత్ర శక్తులు తప్ప, పాలక పార్టీలన్నీ దాదాపు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఈ స్థితిలో కష్టజీవులనంతా ఏకం చేసి గ్రామీణ ప్రాంతాల్లో సమైక్య ఉద్యమాలు సాగించేందుకు మే 16వ తేదీన ఢిల్లీలో వ్యవసాయ కార్మిక జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనను కలిసిన సంఘం నాయకత్వాన్ని చూసిన పాశ్వాన్ ఎంతో ఆనందాన్ని వ్యక్తంచేశారు. సంక్షేమ పథకాలు, మాయమాటలతో పాలకవర్గాలు కష్టజీవుల ఉద్యమంలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయనీ, ఆ చర్యలను తిప్పికొట్టాలని సూచించారు. ఈ బృందంలో బీహార్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి బోలా ప్రసాద్ దివాకర్ తదితరులు ఉన్నారు.