Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఫారసులను తిరస్కరించాలి
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ పునర్విభజన కమిషన్ చేసిన సిఫారసులన్నింటినీ నిర్ద్వంద్వంగా తిరస్కరించాల్సిందిగా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. పునర్విభజన కమిషన్ చేసిన సిఫారసులు ఏ మాత్రమూ సమర్ధనీయం కాని రీతిలో, అశాస్త్రీయంగా వున్నాయని పొలిట్‌బ్యూరో విమర్శిం చింది. జమ్మూ ప్రాంతంలో ఆరు సీట్లను పెంచాల్సిందిగా సిఫారసు చేసిన కమిషన్ కాశ్మీరు లోయలో మాత్రం కేవలం ఒకే సీటును పెంచాలని కోరింది. ప్రాదేశిక నియోజకవర్గ పునర్విభజనకు కమిషన్ 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంది. ఇటువంటి ప్రక్రియ చేపట్టేటపుడు జనాభాను గమనంలోకి తీసుకోవడమనేది ప్రధాన ప్రామాణికంగా వుండాలని పొలిట్‌బ్యూరో పేర్కొంది. కాశ్మీర్ జనాభా 68.9లక్షలుగా వుండగా, జమ్మూ జనాభా 53.8లక్షలుగా వుందని తెలిపింది. కానీ కమిషన్ మాత్రం కాశ్మీర్‌కు 47సీట్లకు, జమ్మూకు 43సీట్లకు పెంచాల్సిందిగా సిఫారసు చేసింది. జనాభా లెక్కల ప్రాతిపదికన సక్రమంగా పునర్విభజన జరిగితే కాశ్మీర్‌కు 51సీట్లు, జమ్మూకు 39సీట్లు వుండాలి. 44శాతం జనాభాతో జమ్మూ 48శాతం సీట్లను పొందగా, 56శాతం జనాభాతో కాశ్మీర్ కేవలం 52శాతం సీట్లను మాత్రమే పొందనుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఆ రకంగా ఈ సిఫారసులు స్పష్టంగా రాజకీయ దురుద్దేశంతో కూడి వున్నాయని, జమ్మూ కాశ్మీర్ జనాభా పాత్రను, కూర్పును మార్చే లక్ష్యంతోనే ఈ చర్యలు వున్నాయని విమర్శించింది. ఈ నేపథ్యంలో ఈ సిఫారసులన్నిం టినీ పూర్తిగా తిరస్కరించాల్సిందేనని కోరింది.