Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రిన్సిపాల్‌పై వీహెచ్‌పీ ఫిర్యాదు
న్యూఢిల్లీ : ఈద్ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేక వీడియో తీయించారంటూ యూపీలోని ఓ ప్రయివేటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రిన్సిపాల్ ఉద్దేశపూరితంగా కుట్ర పన్నారంటూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యులు ఫిర్యాదు చేశారు. అలహాబాద్ జిల్లా ఝాన్సీలోని న్యాయనగర్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ బుష్రా ముస్తఫాపై కేసు నమోదైంది. బాలురు సల్వార్ కుర్తా, ఈద్ టోపీ, బాలికలు సల్వార్ కుర్తా, దుపట్టాలను ధరించగా, హ్యాపీ ఈద్ అంటూ వారంతా ముక్తకంఠంతో చెప్పడం ఆ వీడియోలో కనిపిస్తోంది. మత సామరస్యాన్ని గౌరవించకుండా విద్యార్థులందరూ ముస్లిం మతాన్ని అనుసరించేలా ప్రిన్సిపల్ వ్యవహరించారంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈద్ పండుగ రోజునే పరశురామ జయంతి, అక్షయ తృతీయ కూడా వచ్చాయనీ... కానీ ఆ పండుగల కోసం ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని అన్నారు. ప్రిన్సిపాల్ బుష్రా ముస్తఫా తన హోదాను దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు. మతసామరస్యంతో ఉండాల్సిన పాఠశాల వాతావరణాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. ముస్తఫాపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 295ఏ, ఐటీ యాక్ట్ 67కింద కేసులు నమోదు చేశారు. ఈ వీడియోపై పాఠశాల యాజమాన్యం స్పందించింది. తాము దసరా, దీపావళి పండుగల సమయాల్లోనూ ఈ విధంగా విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామని పాఠశాల సెక్రటరీ సుచిత్రా వర్మ తెలిపారు.