Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీం నివేదన
న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని అధికార యంత్రాంగంపై పట్టు కోసం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య పోరు కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సర్వీసులు లేదా అధికార యంత్రాంగానికి సంబంధించిన అంశంపై కేంద్రం, అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వాల మధ్య నెలకొన్న పోరాటాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం వుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ సమస్యను విచారించి, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఒక ప్రకటన జారీ చేస్తుందని తెలిపింది. ఈ మేరకు బహిరంగ కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు చదివి వినిపించారు. 2018లో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య తలెత్తిన పలు అంశాలను గత తీర్పులో పరిష్కరించడం జరిగిందని, వాటిని ఇప్పుడు సమీక్షించాల్సిన అవసరం కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఇచ్చే సలహాలు, సూచనలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి వుండాలని నాలుగేండ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. ఇరు పక్షాలు పరస్పరం సామరస్యంగా పనిచేసుకోవాల్సి వుంటుందని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో అరాచకం లేదా సంపూర్ణవాదం(నిరంకుశవాదం) కు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే, 2018 నాటి తీర్పు ప్రత్యేకంగా 'సర్వీసుల' అంశం గురించి పేర్కొనలేదని ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ గుర్తు చేశారు.
రాజు లేని రాజ్యం !
'సర్వీసులపై' అధికారం లేని తమ ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితిని 'రాజు లేని రాజ్యం'గా నేషనల్ కేపిటల్ టెరిటరీ గవర్నమెంట్ పోలుస్తూ వ్యాఖ్యానించింది. 'ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం' ఆరోగ్య కార్యదర్శిని లేదా వాణిజ్య కార్యదర్శిని నియమించాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి పొందాల్సి రావాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య అధికారాలనేవి సమిష్టిగా, సమగ్రంగా వుంటాయని 2018నాటి తీర్పు స్పష్టం చేసిందని ఢిల్లీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ఎ.ఎం. సింఘ్వి గుర్తు చేశారు. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై అధికారం లేకుండా ఢిల్లీ ప్రభుత్వానికి సమిష్టి బాధ్యత ఎక్కడ నుండి వస్తుందని ఆయన ప్రశ్నించారు. సమాఖ్యవాదమనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం తరపు వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడానికి అనుకూలంగా వాదనలు వినిపించారు.