Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ దారిలో 66 శాతం మందికి పైగానే..!
- ఉపాధిలేని మహిళల్లో 53 శాతం మంది :ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నివేదిక
న్యూఢిల్లీ : ఉద్యోగులైన మహిళలు ఆధునిక గర్భ నిరోధకాలను ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉన్నదని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 ఐదో రౌండ్ వివరణాత్మక ఫలితాలు వివరించాయి. ఈ సర్వే సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గతేడాది నవంబర్లో వాస్తవ సంక్షిప్త పత్రాన్ని విడుదల చేసిన విషయం విదితమే. ఈ సమాచారం ప్రకారం.. ఉపాధి లేని మహిళల్లో 53.4 శాతం మందితో పోలిస్తే ఉద్యోగులైన మహిళల్లో 66.3 శాతం మంది గర్భనిరోధక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. సామాజిక-ఆర్థిక వృద్ధిని చూసిన ప్రాంతాలు, కమ్యూనిటీల్లోనూ గర్భ నిరోధక వినియోగం పెరగటం గమనార్హం.
ఇక ఆదాయంతో పాటు ఆధునిక గర్భనిరోధక సాధనాల వినియోగం కూడా పెరుగుతున్నది. అత్యల్ప ఆదాయం కలిగిన వర్గాల్లోని మహిళల్లో 50.7 శాతం మంది, అత్యధిక ఆదాయం కలిగిన వర్గాల్లోని మహిళల్లో 58.7 శాతం మంది ఈ వినియోగంలో ఉన్నారు. అభివృద్ధి ఉత్తమ గర్భనిరోధకం అని రుజువు చేసే సాక్ష్యాలను ఈ డేటా జోడిస్తుందని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా అన్నారు. భారత్లో గర్భ నిరోధక పద్ధతులకు సంబంధించిన పరిజ్ణానం దాదాపుగా విశ్వవ్యాప్తమైంది. ప్రస్తుతం 99 శాతం మంది వివాహిత స్త్రీలు, 15 నుంచి 49 ఏండ్ల మధ్య వయస్సున్న పురుషులకు కనీసం ఒక ఆధునిక గర్భనిరోధక పద్ధతి తెలుసు. అయినప్పటికీ, కుటుంబ నియంత్రణ కోసం ఆధునిక గర్భనిరోధకాల వాడకం 56.4 శాతం మాత్రమే. '' స్త్రీ స్టెరిలైజేషన్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన గర్భనిరోధక పద్ధతిగా మిగిలిపోవటం ఆందోళన కలిగించే విషయం. కుటుంబ నియంత్రణ బాధ్యత మహిళల పైనే కొనసాగుతుందని డేటా చూసిస్తున్నది'' అని ముత్రేజా చెప్పారు. ఇక జనాభా ఒక తరం నుంచి మరొక తరానికి సరిగ్గా భర్తీ చేసే రేటు అయిన సంతానోత్పత్తి పున:స్థాపన-స్థాయి 2.1 ని ఐదు రాష్ట్రాలు ఇప్పటికీ సాధించలేదు. వీటిలో బీహార్, మేఘాలయ, యూపీ, జార్ఖండ్, మణిపూర్ లు ఉన్నాయి.