Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల హామీల వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికే... :
- అమిత్‌షాపై సీపీఐ(ఎం) విమర్శలు
కోల్‌కతా : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికే సీఏఏ గురించి అమిత్‌షా మళ్లీమళ్లీ మాట్లాడుతున్నారనని సీపీఐ(ఎం) విమర్శించింది. సీఏఏను పశ్చిమబెంగాల్లో అమలు చేస్తామని అమిత్‌షా పునరుద్ఘాటించడాన్ని 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన అసత్య హమీలను మరుగున పర్చే ప్రయత్నంగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు సుజన్ చక్రవర్తి శుక్రవారం ఆరోపించారు. గురువారం సిలిగిరిలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ సీఏఏ అనేది వాస్తమని, బెంగాల్లో చొరబాట్లను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరుకుంటున్నారని, బెంగాల్‌కు వలస వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి మమతా వ్యతిరేకమని పేర్కొన్న సంగతి తెలిసిందే.
'ఎన్నికల్లో ఎవరి ఓట్లతో గెలిచారో.. వారి పౌరసత్వాన్ని అమిత్ షా ప్రశ్నించగలరా?' అని చక్రవర్తి ప్రశ్నించారు. అలాగే ఈ పౌరసత్వ వివాదంలో మమతా బెనర్జీ పాత్ర కూడా ఉందని చక్రవర్తి ఆరోపించారు. దేశంలో 2003 వరకూ 'అక్రమ వలసదారులు', 'ఎన్నార్సీ' అనే పదాలు లేవని, మమతా బెనర్జీ మంత్రిగా అటల్ బీహారి వాజ్‌పేయి ప్రభుత్వం ఈ పదాలను సవరణల ద్వారా చట్టంలో చేర్చిందని చక్రవర్తి పేర్కొన్నారు. 'సీఏఏ చట్టంతో సంబంధిత పత్రాలను సమర్పించలేని ఏ వ్యక్తులైనా ముప్పును కలిగి ఉంటారని, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో నివాసం కోల్పోయిన పేద ప్రజల వద్ద ఇలాంటి పత్రాలు గల్లంతై ఉండవచ్చు. వీరు ఎక్కువగా నష్టపోతారు' అని సుజన్ చక్రవర్తి పేర్కొన్నారు. అలాగే. అభివృద్ధి చెందలేదనే కారణంగా ఉత్తర బెంగాల్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని గురువారం ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్‌ను కూడా చక్రవర్తి తిరస్కరించారు. 'అభివృద్ధి చెందలేదనే కారణంగా విభజనకు పిలుపుఇవ్వకూడదు. ఈ ప్రాంత అభివృద్ధికి టీఎంసీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుకోవాలి' అని అన్నారు. ఉత్తరబెంగాల్ ప్రజల మనోభావాలను రెచ్చిగొట్టి బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందని చక్రవర్తి విమర్శించారు. టీఎంసీలో ఉన్నప్పుడూ ఇదే డిమాండ్లు చేసిన ఎమ్మెల్యేలు, బీజేపీలో చేరిన తరువాత కూడా ఇదే విధమైన డిమాండ్లు చేస్తున్నారని చెప్పారు.