Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లలో వడ్డీ రేట్ల భయాలు
- సెన్సెక్స్ 866 పాయింట్ల పతనం
ముంబయి : అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలకు తోడు దేశీయంగా వడ్డీ రేట్ల పెంపు భారత స్టాక్ మార్కెట్లను బెంబేలెత్తించాయి. వారాంతం సెషన్లో ఉదయం నుంచి అమ్మకాల ఒత్తిడితో మదుపర్ల సంపద రూ.4.47 లక్షల కోట్లు తుడుచుకుపెట్టుకుపోయింది. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 866.65 పాయింట్లు లేదా 1.56 శాతం పతనమై 54,835.58కి పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 1,115.48 పాయింట్లు లేదా 2 శాతం నష్టపోయి 54,586కు జారిపోయింది. ఒక్క పూటలోనే బిఎస్ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.47 లక్షల కోట్లు కరిగిపోయి రూ.2,55,17,716 కోట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఐటీసీ, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టాటా స్టీల్, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగితా 23 సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలు.. ఆర్బిఐ కీలక వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచి రెపోరేటును 4.4 శాతానికి చేర్చడం మదుపర్లను ఆందోళనకు గురి చేసింది. ముఖ్యంగా రేట్ల పెంపునతో దేశంలో అధిక ధరల కాలం నడుస్తుందన్న ఆర్బీఐ సంకేతాలు ప్రతికూలంగా మారాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు.. అక్కడి మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లు, భారత సూచీలపై పడింది.