Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత రైతు కుటుంబాలకు నేతల పరామర్శ
- డిమాండ్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో చర్చ
న్యూఢిల్లీ: రైతులను కార్లతో తొక్కించి మారణ హౌమం జరిగిన లఖింపూర్ ఖేరీ ప్రాంతాన్ని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు సందర్శించారు. ఘోరమైన మారణకాండలో బాధిత రైతు కుటుంబాలను కలుసుకున్నారు. అలాగే హత్య ఆరోపణలపై అన్యాయంగా అరెస్టు చేయబడిన రైతుల కుటుంబాలను కలుసుకున్నారు. రైతు కుటుంబాలకు ఇచ్చిన డిమాండ్లపై లఖింపూర్ ఖేరీ అడ్మినిస్ట్రేషన్ తో చర్చించారు. ఆశిష్ మిశ్రా టెనీకి సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో మళ్లీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎస్కేఎం పర్యటన జరిగింది. మొదటి నుంచి బాధిత కుటుంబాల పక్షాన ఎస్కేఎం ఉన్నదనీ, వారికి సుప్రీంకోర్టులో న్యాయ సహాయంతో సహా అన్ని రకాలుగా అండగా నిలిచిందని ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ దావలే తెలిపారు. ఎస్కేఎం ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఇతర అధికారులను కలుసుకుందని, రైతుల డిమాండ్లపై చర్చించిందని తెలిపారు. అజరు మిశ్రా టెనిని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలనీ, ఆయనను కుట్ర అభియోగంపై అరెస్టు చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. రైతులపై ఉన్న హత్యా నేరాలు, అన్ని కేసుల ఉపసంహరించాలని కోరారు. లఖింపూర్ ఖేరీ ఊచకోతలో గాయపడిన వారందరికీ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసులో సాక్షులకు పూర్తి భద్రత, వారి రక్షణ కోసం తుపాకీలను తీసుకెళ్లడానికి లైసెన్స్లు ఇవ్వాలని కోరారు.జిల్లా యంత్రాంగం తన పరిధిలో ఉన్న అన్ని సమస్యలను వెంటనే అమలు చేస్తామని ఎస్కేఎం ప్రతినిధి బృందానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ హామీ ఇచ్చారని అశోక్ దావలే తెలిపారు. లఖింపూర్ ఖేరీ కేసులో అరెస్టయిన రైతుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా పూర్తి మద్దతును కొనసాగిస్తామని పునరుద్ఘాటిస్తుందని అన్నారు.ఎస్కేఎం ప్రతినిధి బృందానికి రాకేశ్ తికాయత్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, యుధ్వీర్ సింగ్, జగ్జిత్ సింగ్ దల్లేవాల్, అశోక్ ధావలే, సుర్జిత్ ఫుల్, హరీందర్ సింగ్ లఖోవాల్, గుర్మిత్ సింగ్ మెహమా, హర్పాల్ సింగ్ సంఘా, గుర్బక్ష్ సింగ్ బర్నాలా, బల్వంత్ సింగ్ బెహ్రాంకే నాయకత్వం వహించారు.