Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం కోర్టును ఆశ్రయించిన సీపీఐ(ఎం)
- సీపీఐ(ఎం)తో పాటు ఢిల్లీ హాకర్స్ యూనియన్ పిటిషన్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్ పురిలో అక్రమ కూల్చివేత న్యాయ సూత్రాలు, దేశ రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించే చట్టవిరుద్ధమైన, అమానవీయమైన చర్య అని సీపీఐ(ఎం) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేర్కొంది. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆరోపించినట్టు అక్రమ ఆక్రమణదారులు, అనధికారిక ఆక్రమణదారులు లేరని పిటిషన్లో తెలిపింది.
''ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా దక్షిణ ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో నివసించే, పనిచేస్తున్న ప్రజలకు శ్వాస తీసుకోవడానికి సమయం ఇవ్వకుండా వారి విలువైన రాజ్యాంగ హక్కులు, జీవించే హక్కును నిరాకరిస్తూ భవనాల కూల్చివేతను ప్రారంభించాలని అధికారులు ప్రతిపాదించారు'' అని పిటిషన్లో పేర్కొంది.
ఈ చర్యలు జీవించే హక్కును ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ''మొత్తం ఈ చర్య ఖచ్చితంగా, స్పష్టంగా ఏకపక్షంగా ఉంది. ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘిస్తుంది. దీనిని అనుమతించినట్లయితే, వారి జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న దుకాణాలు, భవనాలను రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించి కూల్చివేశారు'' అని అభ్యర్ధనలో పేర్కొంది. నోటిఫై చేయబడిన ప్రాంతాలలో నివసిస్తున్న, పనిచేస్తున్న ప్రజలు సాధారణంగా చాలా పేదలు, అట్టడుగున ఉన్నవారని తెలిపింది. ఆ ప్రజలు అధికారుల చట్టవిరుద్ధమైన అమానవీయ చర్యను ప్రతిఘటించలేరని కూడా పేర్కొంది. న్యాయవాది సుభాష్ చంద్రన్ కెఆర్ డ్రాఫ్ట్ చేసిన అభ్యర్ధనను సీనియర్ న్యాయవాది పివి సురేంద్రనాథ్, న్యాయవాది బిజు పి రామన్ దాఖలు చేశారు. అక్రమ కూల్చివేతను నిలిపివేయాలని కోరారు.
ఢిల్లీ రెహ్రీ పత్రి ఖోమ్చా హాకర్స్ యూనియన్ న్యాయవాది రామన్ ద్వారా కూడా ఇదే అంశంలో మరో పిటిషన్‌ను దాఖలు చేసింది. మే 4న విహార్ ప్రాంతంలో అధికారులు బుల్డోజర్లతో భవనాలను కూల్చివేశారని పిటిషన్లో పేర్కొన్నారు. 'బుల్డోజర్లతో పేద ప్రజల భవనాలను అక్రమంగా కూల్చివేసి, ప్రజలకు తీవ్ర గాయాలు, నష్టాన్ని కలిగించారు. కానీ తగినంత పోలీసు బలగాలు లేనందున అధికారులు షెడ్యూల్ ప్రకారం కాలింది కుంజ్‌లో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టలేదు. 2022 మే 09 నుండి 13 వరకు షాహీన్ బాగ్, ఇతర ప్రాంతాల్లోని భవనాలను కూల్చివేస్తామని తెలిసింది' అని తెలిపారు.
మునిసిపల్ కార్పొరేషన్ చర్యలు దురుద్దేశంతో కూడుకున్నవని, రాజకీయ గేమ్ ప్లాన్‌లో భాగమని పేర్కొన్నారు. సహజ న్యాయ సూత్రాలు, చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా ఆక్రమణ నిరోధక డ్రైవ్‌లను కొనసాగించవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కూల్చివేత డ్రైవ్‌లో బాధితులకు తగిన నష్టపరిహారం మంజూరు చేయాలని ప్రతివాద అధికారులను ఆదేశించాలని కోరారు.
ఢిల్లీలోని జహంగీర్‌పురి, ఇతర రాష్ట్రాల్లో కూల్చివేత డ్రైవ్‌ల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రస్తుతం పిటిషన్ల ఉన్నాయి. ఏప్రిల్‌లో నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ జహంగీర్‌పురి కూల్చివేత డ్రైవ్‌కు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలనే సుప్రీం కోర్టు ఆదేశం ఇచ్చింది. తీవ్రంగా పరిగణించాలని కోర్టు పేర్కొంది. జమ్యత్-ఉలమా-ఇ-హింద్, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్, జ్యూస్ దుకాణాన్ని కూల్చివేసిన గణేష్ గుప్తా పిటిషన్ దాఖలు చేశారు.