Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్నిహితుల వద్ద నుంచి రూ.19కోట్లకుపైన నగదు సీజ్
న్యూఢిల్లీ : జార్ఖండ్ గనుల శాఖ కార్యదర్శి, ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ భర్త, ఆమె సన్నిహితుల ఇండ్లపై ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారులు ఆకస్మిక సోదాలు జరిపారు. ఉపాధిహామీ పథకం నిధుల దుర్వినియోగం, అవినీతికి సంబంధించిన కేసులో ఆమెకు సంబంధించిన పలువురి ఇండ్లలో సోదాలు చేసిన అధికారులు..మొత్తం రూ.19.31కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పూజా సింఘాల్ చార్డర్డ్ అకౌంటెట్ సుమన్ కుమార్ వద్ద రూ.17కోట్లు, మరో చోట రూ.1.8కోట్ల మేర స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మరోవైపు ఐఏఎస్ అధికారిణి ఇంట్లో, ఆమె సోదరుడు సిద్ధార్థ్ సింఘాల్ ఇండ్లలోనూ సోదాలు చేసిన అధికారులు..నేరారోపణలకు సంబంధించిన కొన్ని పత్రాలు సీజ్ చేసినట్టు తెలిపారు. ఆమె భర్త అభిషేక్ ఝా రాంచీలో పల్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన హాస్పిటల్లోనూ ఈడీ సోదాలు జరిపింది.
ఉపాధి హామీ పథకం నిధుల్లో రూ.18కోట్ల అవినీతి, దుర్వినియోగానికి సంబంధించిన కేసులో జార్ఖండ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికార బృందాలు సోదాలు చేశాయి. వీరివద్ద స్వాధీనం చేసుకున్న డబ్బును లెక్కపెట్టేందుకు మూడు కౌంటింగ్ యంత్రాలను ఉపయోగించినట్టు సమాచారం. సీజ్ చేసిన మొత్తంలో రూ.2000, రూ.500, రూ.200, రూ.100 కట్టలే ఉన్నట్టు తెలిసింది.
2007-08 సంబంధించిన ఈకేసులో గతంలో జార్ఖండ్‌లోని కుంటిలో సెక్షన్ అధికారి, జూనియర్ ఇంజనీర్ రామ్ వినోద్ ప్రసాద్ సిన్హా అరెస్టయ్యారు. జార్ఖండ్ విజిలెన్స్ బ్యూరో అతడిపై 16 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా..ఈ కేసులో ఐఏఎస్ పూజా సింఘాల్ పేరు బయటకు రావడంతో శుక్రవారం ఈడీ రంగంలోకి దిగింది. జార్ఖండ్, బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ముంబయిలలో సోదాలు చేశారు. పూజా సింఘాల్ ప్రస్తుతం జార్ఖండ్ ప్రభుత్వంలోని మైనింగ్, భూగర్భశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ప్రజలను మతోన్మాదంవైపు మళ్లిస్తున్న బీజేపీ
దేశంలో బీజేపీ ప్రజలను మనుషులుగా కాకుండా మతం కోణంలో చూస్తూ మతోన్మాదంవైపు మళ్లిస్తూ కలహాలు సృష్టిస్తోందని మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతోందని చెప్పారు. మనుషులను మనుషులుగా చూడకుండా వారి భావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆవాజ్ హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో ''న్యూ ఫేస్ ఆఫ్ కమ్యూనలిజం'' అంశంపై మొగల్ పురా ఉర్దూఘర్ హాల్లో శనివారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాషిణి అలీ మాట్లాడుతూ.. నాడు ప్రజల్లో ఐక్యతను తీసుకొచ్చేందుకు సుభాష్ చంద్రబోస్ జైహింద్ నినాదంతో కృషి చేశారని చెప్పారు. ఇటువంటి విషయాలను బీజేపీవారు పట్టించుకోకుండా హిందూ ముస్లింల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారని, ప్రజల ఐక్యతాభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలో కాలా బాబా, బాబా వంటి వాటిని చూపెడుతూ భయాందోళన సృష్టిస్తున్నారని తెలిపారు.
దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ, ఏడాదికి కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే కంపెనీ అయిన ఎల్ఐసీని అమ్మడానికి బీజేపీ సిద్ధ పడిందన్నారు. లాభం వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు కట్టబెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏ చిన్న కంపెనీలో కార్మికులకు కష్టం వచ్చినా, ధరలు పెంచినా పనులు బంద్ పెట్టి ధర్నాలు, బైకాట్లు చేసేవారని, ప్రస్తుతం ప్రజలు ఇటువంటి సమస్యలపై దృష్టిసారించకుండా.. బీజేపీ వారు ప్రజలను మత భావాలవైపు మళ్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
1950లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ముస్లింలను ఖతం చేయాలంటూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డాయని గుర్తు చేశారు. నాటి బీజేపీ ప్రధాని ముస్లింలు లేకపోతే తమకు రాజకీయం, రాజ్యాధికారం ఎలా వస్తుందన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం యూపీలో మతతత్వం రాజ్యమేలుతోందన్నారు. మరోపక్క రోజురోజుకూ దళితులపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. హిందుస్థాన్‌ని పూర్తిగా మనువాద సమాజంగా చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఏదైనా సంఘటన గురించిన వార్త వస్తే అందులో మానవీయ కోణం, మనుషుల గురించి ఆలోచించకుండా పేరు ఎవరిది, ఏ మతం అని పరిశీలించే దుస్థితి దాపురించిందని చెప్పారు. ఇటువంటి భావజాలానికి, మనోత్మాద చర్యలకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా ఉంటూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎండి. ఇక్బాల్ జావిద్, ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్, ఉపాధ్యక్షులు అబ్దుల్ లతీఫ్, స్వచ్ఛంద సంస్థ కోవా హుస్సేన్ కరీముద్దీన్, ఆవాజ్ కమిటీ ఉపాధ్యక్షులు బాబర్ ఖాన్, ఆయూబ్‌ఖాన్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.