Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఏడాది గుజరాత్, కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు
- గుజరాత్ అల్లర్ల తర్వాత పెరిగిన బీజేపీ గ్రాఫ్!
- 2013లో యూపీలో ముజఫర్ నగర్ అల్లర్లు
- ఇప్పుడూ అదే ప్రణాళిక...అనేక రాష్ట్రాల్లో మత రాజకీయాలు
న్యూఢిల్లీ : దేశంలో మతతత్వం మునుపెన్నడూ లేనంత స్థాయికి చేరుకుందని ఆయా రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న అల్లర్లే చెబుతున్నాయి. కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అసోం..తదితర రాష్ట్రాల్లో నిత్యం ఏదో ఒక రూపంలో మత చిచ్చురేగుతోంది. తాజాగా ఢిల్లీ నడిబొడ్డున జహింగీర్‌పురి ఉదంతం ఉత్తరాది రాష్ట్రాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఒక మతానికి చెందినవాళ్లను టార్గెట్ చేయటం కోసమే ఈ అల్లర్లు చెలరేగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తద్వారా అధికార బీజేపీకి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టడం సులభమవుతుందని వారు అన్నారు. భజరంగ్‌దళ్, శ్రీరామసేనె, వీహెచ్‌పీ..మొదలైన వాటికి బీజేపీ అధినాయకత్వం నుంచి, ప్రధాని మోడీ, అమిత్ షా సంపూర్ణ మద్దతు లభిస్తోందని, అందువల్లే అవి అంతగా చెలరేగిపోతున్నాయని విమర్శలున్నాయి.
సీఏఏ, ఉమ్మడి పౌరస్మృతి వంటివి కూడా విభజన రాజకీయాల్లో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్లో 2002నాటి అల్లర్ల తర్వాతే బీజేపీ గ్రాఫ్ పెరిగిందని, హిందూ ఓటర్ల ఏకీకరణతో ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారని చెప్పారు. ఇటీవల రాజస్థాన్‌లోని ఆల్వార్, కరౌలీ, జోధ్‌పుర్‌లో మత ఘర్షణలు జరిగాయి. మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. గుజరాత్లో కాంగ్రెస్ బలంగా ఉన్న హిమ్మత్‌నగర్, ఆనంద్, ఖంబాట్ నియోజకవర్గాల్లో మత అల్లర్లు చెలరేగాక, స్వల్ప మెజార్టీతో ఈ స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఖార్గోనే అల్లర్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ బలంగా ఉన్న నిమాద్లో బీజేపీ పుంజుకుంది. రాష్ట్రవ్యాప్తంగా హిందూత్వ ప్రచారం ఊపందుకుంది.
ర్యాలీల పేరుతో..
గుజరాత్ అల్లర్లు, యూపీలో 2013నాటి ముజఫర్‌నగర్ మత ఘర్షణలు దేశంలో హిందూ మత ఏకీకరణను వేగవంతం చేశాయి. ఆయా రాష్ట్రాల్లో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష భావజాలం నింపటం ద్వారా బీజేపీకి ఎన్నికల విజయం దక్కుతోంది. ఇప్పుడు అదే ఫార్ములాను అమలుజేస్తూ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల విజయం అందుకోవాలని హిందూత్వ శక్తులు వ్యూహం పన్నుతున్నాయి. మరికొద్ది నెలల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, హిజాబ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో రామ నవమి, శోభా యాత్రల పేరుతో హిందూత్వ శక్తులు చెలరేగిపోతున్నాయి. దాంతో మసీదుల ముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది. ఈ ఘటనలకు సంబంధించి వార్తలకు అనేక పుకార్లు జోడించి..హిందూత్వ శక్తులు దేశంలో మిగతా చోట్లకు వ్యాపింపజేస్తున్నాయి.
అధిష్టానం అండదండలతో..
ప్రధాని మోడీ, అమిత్ షా నుంచి వస్తున్న మద్దతు చూసుకొని హిందూత్వ శక్తులు చెలరేగిపోతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. సున్నితమైన ప్రాంతాల్లో అక్కడి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెనుకుండి భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు. తమ ప్రాంతంలో అల్లర్లు చెలరేగిన వెంటనే బీజేపీ నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. దాంతో మెజార్జీ హిందువుల్లో ఒకరకమైన అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. మతం పేరుతో హిందువుల్ని ఏకతాటికి తేవాలన్నదే బీజేపీ అధినాయకత్వం వ్యూహం. గతకొన్నేండ్లుగా రకరకాల పద్దతుల్లో హిందూ భావజాలాన్ని విస్తరించడానికి క్షేత్రస్థాయిలో భజరంగ్ దళ్, శ్రీరామసేనె..మొదలైనవి పనిచేస్తున్నాయి.