Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ బీజేపీ నాయకుడు తజీందర్ బగ్గాకు హర్యానా హైకోర్టులో ఉపశమనం లభించింది. శనివారం అర్ధరాత్రి న్యాయస్థానంలో ఆయనపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా మే 10వ తేదీ వరకు విచారణను వాయిదావేసింది. బగ్గాపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని పంజాబ్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. మొహాలీలోని ఒక కోర్టు తనపై జారీచేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను సవాల్ చేస్తూ శనివారం హర్యానా హైకోర్టును బగ్గా ఆశ్రయించారు. దీనిపై అర్ధరాత్రి వరకు విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీచేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట బీజేపీ యువ విభాగం నేతలు ఇటీవల ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బగ్గా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలొచ్చాయి. ఈమేరకు నమోదైన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పంజాబ్ పోలీసులు..శుక్రవారం అతడ్ని ఢిల్లీలో అరెస్టు చేసి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. అతడ్ని బలవంతంగా తరలిస్తున్నట్టు తమకు ఫిర్యాదు వచ్చిందంటూ తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీలో బగ్గా కిడ్నాప్ కేసు నమోదు కావడంతో..ఢిల్లీ పోలీసులు రంగప్రవేశం చేసి అతడ్ని దేశ రాజధానికి తరలించారు.