Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని రాష్ట్ర శాసనసభ ప్రధాన గేటు, ప్రహారీపై ఖలిస్తాన్ జెండాలు ప్రత్యక్షమవడం కలకలం రేపాయి. ఆదివారం తెల్లవారుజామున గేట్లపై ఈ జెండాలు ఉన్నట్టు కాంగ్రా పోలీసులకు సమాచారం అందింది. అసెంబ్లీ కాంప్లెక్స్ గోడలపైనా ఖలిస్తాన్ అనుకూల నినాదాలు కనిపించాయి. స్థానిక ఉప కమిషనర్ నిపుణ్ జిందాల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ''కొందరు అగంతకులు రాష్ట్ర శాసనసభ వెలుపలి గేటుపై అయిదు నుంచి ఆరు ఖలిస్తాన్ జెండాలను ఉంచారు. గోడపై దాని అనుకూల నినాదాలు రాశారు. వాటిని వెంటనే తొలగించాం. ఈ వ్యవహారంపై పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది'' అని చెప్పారు. మరోవైపు ఇది పంజాబ్‌కు చెందిన కొంతమంది దుండగుల దుశ్చర్యగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఈ ఘటనను ఖండించారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ..ట్వీట్ చేశారు. ''ఈ అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు మాత్రమే జరుగుతాయి. కాబట్టి, ఆ సమయంలోనే మరింత భద్రత ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది దుర్మార్గానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటా''మని అన్నారు.