Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరప్రదేశ్‌లో దారుణం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరంలో ఒక ఆసుపత్రిలో పనిచేసిన కరోనా యోధులకు నాలుగు నెలలుగా జీతాలు, ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు చెల్లించడం లేదు. దీంతో సదరు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది ప్రయాగ్‌రాజ్‌లో సమస్యమాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా కరోనా యోధులకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని, తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. సంఘటన వివరాల్లోకి వెళితే ప్రయాగ్‌రాజ్ నగరంలోని తేజ్‌బహదూర్ సప్రు (బేలి) ఆసుపత్రిలో కోవిడ్ సమయంలో ల్యాబ్ టెక్నినీసియన్లు, సెక్యూరిటీ గార్డులు, పారామెడికల్ సిబ్బంది, నాలుగోతరగతి ఉద్యోగులతో సహా వందలాది మంది ఆరోగ్యకార్యకర్తలును ఒప్పంద పద్ధతిలో విధుల్లోకి తీసుకున్నారు. అయితే ఈ ఉద్యోగులకు గత నాలుగు నెలల నుంచి జీతాలను చెల్లించడం లేదు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రోత్సాహకాలు నిలిపివేశారు. దీంతో వందలాది మంది ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'కొన్ని రోజుల్లో మా జీతాలను చెల్లించకపోతే మేం ధర్నా చేస్తాం. ముఖ్యమంత్రిని కలుస్తాం' అని లవకుశ్ అనే ఉద్యోగి చెప్పారు. జీతాలు, ప్రోత్సహకాలు గురించి సంబంధిత చీఫ్ మెడికల్ ఆఫీసర్లు (సిఎంఒ)లను అడిగే నిధులు లేవని సమాధానం ఇస్తున్నారని చెప్పారు. జీతాలు లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నామని, అద్దె చెల్లించపోవడంతో ఇళ్లు ఖాళీ చేయమని యాజమానులు చెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు 'యోధులు' అనే బిరుదు ప్రభుత్వం ఇచ్చిందని, కానీ మా కుటుంబాలు ఆకలితో ఉన్నాయని మరొక ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రయోగ్‌రాజ్‌లో సమస్య మాత్రమే కాదని, ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో కరోనా యోధులకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగులు తెలిపారు. 'మాలో అనేక మంది వైరస్ బారీనపడ్డారు. నలుగురు మరణించారు. అయినా మేం విధులు నిర్వహించాం. కానీ మాకు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు' అని అభినవ్ తివారీ అనే ఉద్యోగి పేర్కొన్నారు.