Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక ఉష్ణోగ్రతతో పడిపోయిన పంట దిగుబడి
- 2014-15 తర్వాత మొదటిసారి
- అయినా..ఎగుమతులను ప్రోత్సహిస్తున్న కేంద్రం
- ప్రజా పంపిణీపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఆహార పంటల దిగుబడులు పడిపోతున్నాయి. భారత్‌లోనూ ప్రధాన పంటల దిగుబడి గణనీయంగా పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన పంట అయిన గోధుమ దిగుబడులు భారీస్థాయిలో పడిపోయాయి. కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశుపాండే మీడియాకు విడుదల చేసిన సమాచారం ప్రకారం, గత ఏడాది 10.95కోట్ల టన్నుల గోధుమ దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం (2021-22లో)11.13కోట్ల టన్నుల గోధుమ పంట వస్తుందని కేంద్రం తొలుత అంచనావేసింది. ఇప్పుడు 10.5కోట్ల టన్నులు మాత్రమే వచ్చేట్టు ఉందని తెలిపింది. 2014-15 తర్వాత దేశంలో గోధుమ దిగుబడి పడిపోవటం ఇదే మొదటిసారి. ఏప్రిల్ చివరినాటికి గోధుమ దిగుబడులు మరింత పడిపోయాయని కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ గణాంకాలు మీడియాకు విడుదల కావాల్సి ఉంది.
లాభాలు పోగేసుకున్న ప్రయివేటు వ్యాపారులు
పంట దిగుబడి పడిపోవటం ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం చూపనున్నది. అంతేగాక బహిరంగ మార్కెట్లో గోధుమల ధరలు మరింత పెరిగే అవకాశముంది. మనదగ్గర గోధుమ కొరత తీవ్రస్థాయిలో ఉన్నా కేంద్రం ఎగుమతులకు ప్రోత్సహిస్తోంది. దాదాపు కోటి టన్నుల గోధుమ ఎగుమతులు జరిగాయని తెలిసింది. మార్కెట్‌కు వస్తున్న పంటను ఎంఎస్‌పీకన్నా తక్కువకు కొనుగోలుచేస్తున్న ప్రయివేటు వ్యాపారులు, దానిని ఇతర దేశాలకు ఎగుమతి చేసుకొని లాభాలు పోగేసుకుంటున్నారు. జూన్‌లో ప్రభుత్వ కొనుగోళ్లు ఆగిపోయాక, మరింత తక్కువ ధర వద్ద రైతు నుంచి ట్రేడర్స్ కొనుగోళ్లు చేయనున్నారు.
ప్రపంచ మార్కెట్లోనూ గోధుమ కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడింది. దీనిని సదావకాశంగా మలుచుకొని దేశీయంగా గోధుమ దిగుబడులు పెంచుకొని ఉంటే మన రైతులు లాభపడేవారని, గోధుమ ఎగుమతుల ద్వారా ఆదాయం సమకూరేదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ సంగతులు గ్రహించే ఆసక్తి కేంద్రానికి లేదని దీనిని బట్టి అర్థమవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనివల్ల గోధుమ పంట దెబ్బతిన్నదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పంట పొలాల్లో గింజలు సరిగా ఎదగలేదని, చిన్న చిన్న గింజలతో పంట దిగుబడి గణనీయంగా దెబ్బతిన్నదని నిపుణులు తెలిపారు.
55శాతం పడిపోయిన పంట కొనుగోళ్లు
ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఆయా రాష్ట్రాల్లో గోధుమ కొనుగోళ్లు తగ్గాయని కేంద్ర ఆహార శాఖ గణాకాలు చెబుతున్నాయి. వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుతం గోధుమ కొనుగోళ్లు జూన్ వరకు కొనసాగనున్నాయి. ఈ సీజన్లో పంట కొనుగోళ్లు కోటీ 95లక్షలు ఉంటుందని కేంద్రం అంచనా వేసింది. దీంట్లో కోటీ 75లక్షల టన్నుల పంట కొనుగోళ్లు జరిగాయని సమాచారం. ఈసారి గోధుమ సేకరణ ఇంత తక్కువస్థాయిలో ఉండటం ఆందోళన కలిగించే అంశమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో 4.33కోట్ల టన్నుల గోధుమ కొనుగోళ్లు జరిగాయని, దాంతో పోల్చితే కొనుగోళ్లు 55శాతానికిపైగా తగ్గాయని తెలుస్తోంది. గత 20ఏండ్లలో గోధుమ కొనుగోళ్లు ఇంత కనిష్టస్థాయికి చేరుకోవటం ఇదే మొదటిసారి.
పట్టించుకోని కేంద్రం
గోధుమ సంక్షోభం దేశాన్ని తీవ్రంగా కుదిపేయనున్నదని వార్తలు వెలువడుతున్నాయి. పంట దిగుబడులు పడిపోయాయన్న సంకేతాలు వచ్చినా మోడీ సర్కార్ మేల్కోవటం లేదు. సమస్య పరిష్కారానికి..సంక్షోభ తీవ్రతను తగ్గించే మార్గాల్ని అన్వేషించే ప్రయత్నం చేయటం లేదు. ఇంతకు ముందు కోవిడ్ సమయంలో 2021లో ఆక్సీజన్ కొరత ఏర్పడింది. గత ఏడాది బొగ్గు కొరత తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ రెండు సమస్యలపై రాష్ట్రాలు ఎంతమొత్తుకున్నా కేంద్రం నుంచి స్పందన కరువు. తాజాగా గోధుమల కొరత విషయంలోనూ అదే జరుగుతుందని, ప్రజల ఆకలి కేకల్ని కేంద్రం పట్టించుకునే అవకాశం లేదని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.