Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైన్యం వ్యూహాత్మక ఆపరేషన్లపై ప్రభావం
- రాజకీయ నాయకత్వానిదే బాధ్యత : ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వి.పి.మాలిక్
న్యూఢిల్లీ : భారత సైన్యంలో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్'(సీడీఎస్) పదవి ఐదు నెలలుగా ఖాళీగా ఉండటంపై రక్షణరంగ నిపుణులు, మాజీ సైనిక ఉన్నతాధికారులు తప్పుబడుతున్నారు. ఎంపికకు సంబంధించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. సస్పెన్స్ నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఆహ్వానించదగింది కాదని, దీనిని ఆపాల్సిన బాధ్యత మోడీ సర్కార్‌దేనని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వి.పి.మాలిక్ అన్నారు. సీడీఎస్ పోస్ట్ ఖాళీగా ఉండటం భారత సైన్యం వ్యూహాత్మక ఆపరేషన్లపై ప్రభావముంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భద్రతకు మంచిది కాదన్నారు. ఆంగ్ల న్యూస్ వెబ్‌పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ...ఐదునెలలుగా సీడీఎస్ పదవి ఖాళీగా ఉండటానికి రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించాలన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో భారత ఆర్మీచీఫ్‌గా పనిచేసిన వి.పి.మాలిక్ సీడీఎస్ పోస్ట్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇతర దేశాల్లోనూ ఉంది...
దేశంలో సీడీఎస్‌ను ఏర్పాటుచేయాలని 20ఏండ్ల క్రితం నుంచే కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. నావికాదళం, పదాతిదళం, వైమానిక దళం..మధ్య ఒక సమన్వయ కర్తగా సీడీఎస్ బాధ్యతలు ఉన్నాయి. ఇలాంటి పదవిని ఇన్ని నెలలుగా ఖాళీగా ఉంచడం దేశ భద్రతకు మంచిది కాదు. ఆర్మీ చీఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్‌ఫోర్స్, చీఫ్ ఆఫ్ నేవీ..పదవులను ఎలాగైతే వెంటనే భర్తీ చేస్తామో..సీడీఎస్ పదవిని కూడా ఆలస్యం చేయకుండా భర్తీ చేయాలి.నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ..ఈ మూడూ ఒకదానితో ఒకటి కలిసి పనిచేయాలి. ముఖ్యంగా సైనిక ఆపరేషన్ల విషయంలో. అలా జరగనట్టయితే..ఆ సైనిక ఆపరేషన్ ప్రభావం తేలిపోతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సైనిక ఆపరేషన్లు సమర్థవంతంగా జరిగేట్టు చూడాల్సిన బాధ్యత సీడీఎస్పైన ఉంటుంది. కార్గిల్ యుద్ధంలో నాకు ప్రత్యక్షంగా అనేక అనుభవాలున్నాయి. త్రివిధ దళాలు సంయుక్తంగా చేపట్టే ఆపరేషన్లు ఎంతో ప్రభావం చూపాయి. అది చాలా అవసరం కూడా.
వ్యూహం, శక్తి దెబ్బతింటాయి
సీడీఎస్ ఐదు నెలలుగా లేకపోవటం కచ్చితంగా ప్రతికూల ఫలితాల్ని ఇస్తుంది. సమీకృత ఆదేశాలు సైనిక బలగాలకు లేకపోవటం..రాబోయే రోజుల్లోనూ ఎదుర్కొంటాం. ఎవరికి వారు తమ తమ క్షేత్రంలో త్రివిధ దళాలు పనిచేయాల్సి వస్తోంది. కలిసికట్టుగా చేపట్టే ఆపరేషన్లు నిర్వహించలేకపోవ చ్చు. ఉత్తర, పశ్చిమ సరిహద్దులు మన బలగాలకు అత్యంత కీలకమైనవి. సీడీఎస్ లేకపోవటం అక్కడ మన సైనిక బలగాల శక్తిని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా భద్రతాపరమైన ఒక ముఖ్యమైన వ్యూహాన్ని ఎంచుకోవాలన్నా సీడీఎస్ ఉండాలి. అంతేకాదు ఎంతమంది బలగాల్ని పంపాలి? నిర్వహణ, సంయుక్త శిక్షణ, రవాణా..ఇవన్నీ కూడా సీడీఎస్‌తో ముడిపడి ఉన్నాయి.
ఫైనల్‌గా చెప్పేదేంటంటే..సీడీఎస్ పోస్ట్ భర్తీ ఎప్పుడన్నది తెలియదు. మరికొంత కాలం పట్టొచ్చు! దీనిగురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. సస్పెన్స్ ఉంది. ఇదంతా అనవసరం. దేశానికి మంచిది కాదు. ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన వ్యక్తినే తీసుకోవాలనేం లేదు. త్రివిధ దళాల్లో పనిచేసిన వారెవరైనా ఎంచుకోవచ్చు.