Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాహీన్‌బాగ్‌లో నిరసనల వెల్లువ
- ఢిల్లీలో ఉద్రిక్తత... జోక్యం చేసుకోం.. : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలతో వార్తల్లో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చేందుకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) సిద్ధపడింది. షాహీన్‌బాగ్‌లోని కలింది కుంజ్, జామియా నగర్ ప్రాంతాల్లోకి ఉదయమే బుల్డోజర్లను మోహరించారు. షాహీన్‌బాగ్‌లోని 'జీ' బ్లాక్ నుంచి జసోలా వరకు, జసోలా నాలే నుంచి కలింది కుంజ్ పార్క్ వరకు బుల్డోజర్లు మోహరించాయి. స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురైతే, దాన్ని అడ్డుకునేందుకు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు చేరుకున్నాయి. కాగా, ఎస్డీఎంసీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. అక్రమ నిర్మాణాలను తొలగించే కార్యక్రమం మే 5నే ప్రారంభించాల్సి ఉండగా.. పోలీసులు అందుబాటులో లేకపోవడం వల్ల సోమవారానికి వాయిదా వేసినట్టు ఎస్డీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. 'ఎస్డీఎంసీ బృందం ఉదయం 11 గంటలకు షాహీన్‌బాగ్‌లో ఆక్రమణల నిరోధక డ్రైవ్‌ను నిర్వహించడానికి వచ్చింది. కూల్చివేత డ్రైవ్‌లో పోలీసు బలగాలు మాకు సహాయంగా ఉంటాయి. ఈ విషయమై పోలీసు అధికారులతో నిరంతరం టచ్‌లో ఉంటాం' అని ఆ అధికారి పేర్కొన్నారు. కాగా, బుల్డోజర్లకు ఎదురుగా బైఠాయించి స్థానికులు నిరసనకు దిగారు. ఎస్డీఎంసీ వెంటనే బుల్డోజర్లను వెనక్కి పిలవాలనీ, కూల్చివేతలు జరుగకుండా నిరోధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై నిరసనలో పాల్గొన్న ఒక నాయకుడు మాట్లాడుతూ ''బుల్డోజర్లతో విద్వేషాన్ని రెచ్చ గొడుతున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎట్టి పరిస్థితుల్లో కూల్చి వేతలు జరగనివ్వం' అన్నారు. మరొక నేత మాట్లాడుతూ 'మున్సిపాలిటీలో 15 ఏండ్లుగా బీజేపీనే అధికారంలో ఉంది. ఉన్నపళంగా ఏమైందో తెలీడం లేదు' అని విమర్శించారు. ఆప్‌కు చెందిన ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ మాట్లాడుతూ 'ఇక్కడ ఎటువంటి అక్రమ నిర్మాణాలు లేవు. ఆక్రమణలను తొలగించే పనికి నేను అడ్డుపడుతున్నాను అని చూపించడానికి వారు బుల్డోజర్ను తీసుకువచ్చి ఇక్కడ ఉంచారు' అని అన్నారు.
ఢిల్లీ హైకోర్టులోనే తేల్చుకోండి : సుప్రీంకోర్టు
దక్షిణ ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమనీ, ఏదైనా ఉంటే ఢిల్లీ హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. షాహీన్‌బాగ్‌లోని కలిందికుంజ్, జామియానగర్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సోమవారం ఉదయం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్లతో షాహీన్‌బాగ్ చేరుకున్నారు. కాగా, దీనిని నిరసిస్తూ సుప్రీంకోర్టులో సీపీఐ(ఎం) పిటిషన్ దాఖలుచేసింది. కూల్చి వేతలపై స్టే ఇవ్వాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. కాగా, దీనిపై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు తెలిపింది. 'దయచేసి కనీసం రెండు రోజులు (కూల్చివేతపై) స్టే విధించండి' అని సీపీఐ(ఎం) కోరింది. 'చట్ట ఉల్లంఘన జరిగితే జోక్యం చేసుకుంటాం' అని సుప్రీంకోర్టు పేర్కొంది.