Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించాలి :
జంతర్ మంతర్ వద్ద ధర్నాలో వక్తలు
న్యూఢిల్లీ : దేశ విద్యా వ్యవస్థను నాశనం చేసే జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) ఉపసంహరించాలని విద్యా వేత్తలు కోరారు. ఎన్ఈపీ రద్దు చేయాలని ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ (ఎఐఎస్ఈసీ) ఆధ్వర్యంలో సోమవారం నాడిక్కడ జంతర్ మంతర్ వద్ద ఆందోళన జరిగింది. ఎఐఎస్ఈసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ అనిస్ కుమార్ రే మాట్లాడుతూ ఎన్ఈపీని వేగంగా అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం మొదటగా విద్యా వ్యవస్థను నియంత్రించే అన్ని కేంద్ర సంస్థల, పరిశోధన కేంద్రాల, యూనివర్సిటీల అధిపతులుగా పాలకుల అడుగులకు మడుగులొత్తే వారిని నియమించిందని విమర్శించారు. ఎన్ఈపీని అమలు చేసే బాధ్యతను ఓపెన్ గా ఆరెస్సెస్ అనుబంధ ప్రయివేటు సంస్థ అయిన భారతీయ శిక్షణ్ మండల్ కు అప్పగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే ఒక ఆకర్షణీయమైన పేరుతో సైన్సు, చరిత్రను వక్రీకరిస్తూ పుక్కిటి పురాణ కథలను వాస్తవాలుగా నమ్మించి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఎన్ఈపీ దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థలు విద్యలో భారీ పెట్టుబడులు పెట్టి, విద్యను గ్లోబల్ వ్యాపారంగా మార్చడానికి అనుకూలంగా తయారైన విధానమని ఆయన విమర్శించారు.
ప్రొఫెసర్ ధృవ ముఖర్జీ మాట్లాడుతూ ఈ విధానంలో మూడు అంశాలు ప్రధానంగా ఉన్నాయని, ప్రభుత్వాలు ప్రజలకు విద్యనందించే బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాయని విమర్శించారు. విద్యా వ్యాపారీకరణ-ప్రయివేటీకరణను మరింత ప్రోత్సహించడం, స్కిల్స్ నేర్పడమే విద్యా లక్ష్యంగా మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రోత్సహించడం జరుగుతుందని విమర్శించారు. విద్యలో అంతో ఇంతో మిగిలివున్న సెక్యులర్ విలువలను ధ్వంసం చేసి, వాటి స్థానంలో మతతత్వ భావాలను, మూఢ నమ్మకాలను పెంచేవిధంగా పాఠ్య పుస్తకాలను తయారు చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ అన్ని అధికారాలను కేంద్రం గుప్పెట్లోకి తీసుకొని నిరంకుశంగా విద్యా సంస్థలను శాసిస్తుందని అన్నారు.
ఎఐఎస్ఈపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. గోవింద రాజులు మాట్లాడుతూ ''కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఎన్ఈపీ ప్రస్తుత విద్యా వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించి, ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా లేదు. ఉన్న విద్య వ్యస్థను మరింత బ్రష్టు పట్టించే విధంగా ఉంది'' విమర్శించారు. ఈ ధర్నాలో జేఎన్ యూ ప్రొఫెసర్ సచ్చిదానంద సిన్హా, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ నరేంద్ర శర్మ, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ జార్జి జోసెఫ్, విద్యావేత్త డాక్టర్ మైఖేల్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 22 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.