Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి అజరుమిశ్రా తేని బెదిరింపు వ్యాఖ్యలు చేయకపోతే.. లఖీంపూర్ ఖేరి దారుణ హత్యకాండ ఘటన జరిగి ఉండేదే కాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఉదహరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నలుగురు నిందితులకు బెయిల్‌ను తిరస్కరించింది. గత ఏడాది అక్టోబర్ 3న లఖీంపూర్ ఖేరిలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్న సందర్భంగా ఒక జర్నలిస్టు, నలుగురు రైతులను కారుతో తొక్కించి హత్య చేశారు. తరువాత జరిగిన అల్లర్లలో మరో ముగ్గరు మరణించారు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తాయి. అయితే ఘటనకు కొన్ని రోజుల ముందు '2 నిమిషాల్లో రైతులను ముగిస్తాను' అని నరేంద్రమోడీ ప్రభుత్వంలోని హోంశాఖ సహాయ మంత్రి అజరుమిశ్రా బెదిరింపులు వ్యాఖ్యలు చేశారు. లఖీంపూర్ ఖేరీ మారణకాండ కేసులో అజరుమిశ్రా కుమారుడు అశీష్ మిశ్రానే ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. రైతులను అశీష్ మిశ్రా కారుతో తొక్కించి చంపేశాడని అని ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. ఈ కేసును విచారిస్తున్న అలహాబాద్ హైకోర్టు సోమవారం 'కేంద్ర మంత్రి అజరు మిశ్రా ఈవిధమైన బెదిరింపు వ్యాఖ్యలు చేసిన ఉండకపోతే, లఖీంపూర్ ఖేరీ ఘటన జరిగి ఉండేదే కాదు' అని వ్యాఖ్యానించింది.
లఖీంపూర్ ఘటనకు కొన్ని రోజుల ముందు, అజరు మిశ్రా ఆ ప్రాంతంలో ఒక ప్రసంగంలో, రైతులు తమ ఆందోళనను విరమించుకోకపోతే ''రెండు నిమిషాల్లో రైతులను ముగిస్తా'' అని బెదిరించారు.
'రాజకీయ నాయకులు మర్యాదపూర్వకమైన భాషలో ప్రసంగాలు చేయాలి. నాయకులు తమ హోదా, పదవి గౌరవానికి తగినట్లుగా నడుచుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘించే విధంగా వారు ఉండకూదు' అని హైకోర్టు పేర్కొంది. అలాగే ఆ ప్రాంతంలో రైతుల నిరసన కారణంగా ఆంక్షలు విధించినప్పటికీ ఆ ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అతిధిగా హజరుకావాడాన్ని కూడా కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ' ఆ ప్రాంతంలో ఉన్న నిషేధ ఉత్తర్వుల గురించి ఉప ముఖ్యమంత్రికి తెలియదని మేము నమ్మం. నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో జరిగిన కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా హజరయ్యారు' అని కోర్టు పేర్కొంది. ఈ కార్యక్రమానికి వెళుతున్న కేంద్ర మంత్రి అజరు మిశ్రా కాన్వారులోనే అతని కుమారుడు ఆశీష్ మిశ్రా కూడా ఉన్నాడు.